కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు భారీ శుభవార్త
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏళ్లుగా వేతనాల చెల్లింపులో ఎదురవుతున్న జాప్యం, కోతలకు శాశ్వత పరిష్కారంగా ఏప్రిల్ నెల నుంచి నేరుగా ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లోనే జీతాలు జమ చేయాలని నిర్ణయించింది.
ప్రస్తుతం రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులకు అమలులో ఉన్న ఐఎఫ్‌ఎంఎస్ (IFMS) విధానాన్ని ఇదే తరహాలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా అమలు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మందికి పైగా ఉన్న ఈ సిబ్బందికి పారదర్శకంగా వేతనాల చెల్లింపునకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఉన్న IFMS పోర్టల్‌లో ప్రత్యేక ఆప్షన్ చేర్చాలా? లేక ప్రత్యేకంగా కొత్త వెబ్ పోర్టల్ రూపొందించాలా? అన్న అంశంపై అధికారులు చర్చిస్తున్నారు.
మధ్యవర్తుల దోపిడీకి చెక్
ఇప్పటివరకు ప్రభుత్వం విడుదల చేసిన నిధులు ఏజెన్సీలు లేదా శాఖాధిపతుల (HOD) ఖాతాల్లోకి వెళ్లేవి. ఈ విధానాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలు ఉద్యోగుల జీతాల్లో అక్రమ కోతలు విధించడంతో పాటు, లేని ఉద్యోగుల పేర్లతో కూడా జీతాలు డ్రా చేస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేయడంతో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.
పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి నిధులను కూడా ఏజెన్సీలు సరిగా జమ చేయడం లేదన్న ఆరోపణల నేపథ్యంలో, కొత్త విధానం ద్వారా ఈ నిధులు నేరుగా ఉద్యోగుల ఖాతాల్లోకే చేరనున్నాయి.
ఉద్యోగుల సంఖ్య 5 లక్షలు దాటింది
ప్రాథమికంగా రాష్ట్రంలో 4.93 లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నట్లు అంచనా వేసిన ప్రభుత్వం, ఆధార్ ఆధారిత డేటా సేకరణ తర్వాత ఈ సంఖ్య 5 లక్షలు దాటినట్లు గుర్తించింది. గ్రామాల్లో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్లు, గురుకులాలు, మున్సిపాలిటీలు, ఆరోగ్య శాఖ, యూనివర్సిటీల్లో పనిచేసే సిబ్బందిని కూడా ఈ జాబితాలో చేర్చారు.
ఈ నిర్ణయంతో ఉద్యోగులకు ఆర్థిక భద్రతతో పాటు సామాజిక భద్రత కూడా లభించనుండటంతో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Post a Comment