-->

ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి తల్లి ఆత్మహత్య

20 రోజుల్లో ఇలాంటి మూడు ఘటనలు.. నంద్యాల జిల్లాలో కలకలం క్షణికావేశంలో విచక్షణ కోల్పోతున్న దంపతులు


నంద్యాల: ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు కొందరిని అతి తీవ్ర నిర్ణయాల వైపు నెడుతున్నాయి. సమస్యలను ఎదుర్కోలేక ఆత్మహత్యే శరణ్యమని భావిస్తూ, ఏ పాపం తెలియని చిన్నారుల జీవితాలను కూడా ముగిస్తున్న ఘటనలు నంద్యాల జిల్లాలో వరుసగా చోటుచేసుకుంటున్నాయి. తల్లిదండ్రుల క్షణికావేశపు నిర్ణయాలు కుటుంబ సభ్యులకు తీరని విషాదాన్ని మిగులుస్తున్నాయి.

20 రోజుల్లో ఏడుగురు చిన్నారుల మృతి

గడివేముల మండలం ఒండుట్ల గ్రామానికి చెందిన బుగ్గానిపల్లి ఎల్లా లక్ష్మీ (23) గతేడాది డిసెంబర్‌ 28న తన పిల్లలు వైష్ణవి (3), మూడు నెలల చిన్నారి సంగీతను ఎస్సార్బీసీ కాల్వలో తోసి, తాను కూడా కాల్వలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ ఘటన జరిగి నాలుగు రోజులు గడవకముందే ఉయ్యాలవాడ మండలం తుడుములదిన్నె గ్రామంలో వేములపాటి సురేంద్ర (34) ఆర్థిక సమస్యలు తట్టుకోలేక తన పిల్లలు కావ్యశ్రీ (7), ధ్యానేశ్వరి (4), సూర్యగగన్‌ (1.5)లకు పాలలో విషం కలిపి తాపించి, తాను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

తాజాగా, భర్త వేధింపులు భరించలేక మల్లిక (27) అనే మహిళ తన ఇద్దరు పిల్లలు ఇషాంత్‌ (7), పరిణతి (9 నెలలు)కు పురుగుల మందు తాపి, ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

ఈ మూడు ఘటనల్లో అభం శుభం తెలియని ఏడుగురు చిన్నారులు తమ నిండు జీవితాలను కోల్పోయారు.

జీవితాలను బలి చేసుకోవద్దు

సమస్య చిన్నదైనా కొందరు తీవ్రంగా భావించి అతి నిర్ణయాలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము లేకపోతే పిల్లలకు భవిష్యత్తు లేదనే అపోహతో బలవన్మరణానికి పాల్పడుతూ, తమతోపాటు చిన్నారులను కూడా తీసుకెళ్లడం మరింత బాధాకరమని అంటున్నారు. సమస్యలు ఉంటే పరస్పరం మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని, క్షణికావేశంలో జీవితాలను బలి చేసుకోవద్దని సూచిస్తున్నారు.

గమనిక: మీరు లేదా మీకు తెలిసిన వారు మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లయితే వెంటనే సహాయం కోరండి. ఆత్మహత్య నివారణ హెల్ప్‌లైన్ (భారత్): 9152987821 | 14416 మీ జీవితం విలువైనది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793