ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ప్రభుత్వ మహిళా ఉపాధ్యాయురాళ్లు మృతి
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని అర్వపల్లి సమీపంలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రభుత్వ మహిళా ఉపాధ్యాయురాళ్లు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
సంక్రాంతి సెలవుల అనంతరం పాఠశాలలు ప్రారంభమైన తొలి రోజే ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. నల్గొండ నుంచి కారులో విధులకు బయలుదేరిన ఐదుగురు ఉపాధ్యాయుల కారు అర్వపల్లి వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. టైర్ పేలడంతో ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం.
ఈ ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కల్పన అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఉపాధ్యాయురాలు రావులపల్లి జీహెచ్ఎం గీత తీవ్రంగా గాయపడగా, మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. ప్రవీణ్, సునీతలకు తీవ్ర గాయాలు కాగా, ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు.
పాఠశాలలు తెరిచిన మొదటి రోజే ఉపాధ్యాయుల ప్రాణాలు కోల్పోవడంతో విద్యా శాఖతో పాటు సహచర ఉపాధ్యాయులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Post a Comment