-->

మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర ఏర్పాట్లపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర ఏర్పాట్లపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష


తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద ఆదివాసీ పండుగగా పేరొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర ఏర్పాట్లను ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి శుక్రవారం సమీక్షించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రివర్గ సహచరులతో కలిసి సీఎం బస్సులో జంపన్న వాగు సర్కిల్ వరకు ప్రయాణించి, జాతరకు వచ్చే లక్షలాది భక్తుల కోసం చేపట్టిన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.

జాతరకు సంబంధించి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల అనుసంధానం, డ్రోన్ కెమెరాల వినియోగం వంటి భద్రతా చర్యలను సీఎం గారు పర్యవేక్షించారు. భక్తుల భద్రత దృష్ట్యా చేపట్టిన ఏర్పాట్లను సమగ్రంగా సమీక్షించారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, ఏఐ (AI) సాంకేతికతతో పనిచేసే వ్యవస్థల పనితీరును పోలీసు ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి గారికి వివరించారు.

దాదాపు వెయ్యేళ్ల చరిత్ర, వీరగాథలు, ఆదివాసీ జాతి వారసత్వ సంపదకు అద్దం పట్టేలా రాతి ప్రాకారాలు, శిలాతోరణాలతో మేడారం వనదేవతల గద్దెల ప్రాంగణాన్ని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరిస్తున్న పనులను సీఎం పరిశీలించారు.

మూలవాసులైన కోయ తెగల సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ప్రతిబింబించేలా రూపకల్పన చేసిన ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి గారు ఆసాంతం సందర్శించారు. సుమారు రూ.250 కోట్ల వ్యయంతో గత కొంతకాలంగా శరవేగంగా సాగుతున్న అభివృద్ధి పనులను ఒక్కొక్కటిగా పరిశీలించి, అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.

లక్షలాది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, భద్రతతో పాటు సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని సీఎం ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793