భద్రతా బలగాలు–మావోయిస్టుల మధ్య ఎన్‌కౌంటర్ ఆరుగురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా దండకారణ్య అటవీ ప్రాంతంలో మరోసారి భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య తీవ్ర ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో శనివారం, ఆదివారం వరుసగా జరిగిన ఈ ఎన్‌కౌంటర్లలో మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు.
నిఘా వర్గాల నుంచి అందిన పక్కా సమాచారం ప్రకారం, దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు, పశ్చిమ సబ్ జోనల్ బ్యూరో ఇన్‌చార్జి సున్నం చంద్రయ్య అలియాస్ పాపారావు, అలాగే నేషనల్ పార్క్ ఏరియా కమిటీ చీఫ్ దిలీప్ బెడ్జా ఆ అటవీ ప్రాంతంలో ఉన్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. ఈ సమాచారంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు సంయుక్తంగా ప్రత్యేక ఆపరేషన్‌ను ప్రారంభించాయి.
శనివారం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టిన సమయంలో మావోయిస్టులు కాల్పులకు దిగారు. దీనికి ప్రతిగా జరిగిన ఎదురుకాల్పుల్లో నేషనల్ పార్క్ ఏరియా కమిటీ చీఫ్ దిలీప్ బెడ్జా సహా నలుగురు మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఒక మహిళా మావోయిస్టు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ఘటన అనంతరం భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలను కొనసాగించాయి. ఆదివారం కూడా అదే అటవీ ప్రాంతంలో మరోసారి ఎదురుకాల్పులు జరిగి, మరో ఇద్దరు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రెండు రోజుల పాటు జరిగిన ఎన్‌కౌంటర్లలో మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు.
ఎన్‌కౌంటర్ ప్రాంతంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన భద్రతా బలగాలు AK-47 తుపాకీ, .303 రైఫిల్‌తో పాటు భారీగా పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఆయుధాలు మావోయిస్టులు పెద్ద ఎత్తున దాడులకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని సూచిస్తున్నాయని అధికారులు తెలిపారు.
ఈ ఘటనతో బీజాపూర్ జిల్లా దండకారణ్య ప్రాంతంలో భద్రతా బలగాలు అప్రమత్తతను మరింత పెంచాయి. మావోయిస్టుల కదలికలపై నిఘా ముమ్మరం చేస్తూ, పరిసర అటవీ ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.

Post a Comment