-->

జంపన్నవాగులో నిరంతర జలప్రవాహం రామప్ప–లక్నవరం నుంచి పైప్‌లైన్ ద్వారా నీరు: సీఎం రేవంత్ రెడ్డి

మేడారం జంపన్నవాగులో నిరంతర జలప్రవాహం రామప్ప–లక్నవరం నుంచి పైప్‌లైన్ ద్వారా నీరు: సీఎం రేవంత్ రెడ్డి


మేడారం | ఆదివాసీ వీరవనితలు సమ్మక్క–సారలమ్మలు కొలువైన మేడారం జంపన్నవాగులో సంవత్సరం పొడవునా నీరు ప్రవహించేలా రామప్ప–లక్నవరం నుంచి పైప్‌లైన్ ద్వారా నీటిని తరలిస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. మేడారం పుణ్యక్షేత్రాన్ని తిరుమల–తిరుపతి, కుంభమేళాలను తలపించేలా ప్రతిరోజూ భక్తులు, పర్యాటకులు సందర్శించే కేంద్రంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.

సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా మేడారంలో నిర్వహించిన సాంస్కృతిక ఉత్సవాల్లో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రివర్గ సహచరులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. మేడారంలో నిర్వహించిన మంత్రిమండలి సమావేశం అనంతరం జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం ప్రసంగిస్తూ ఆదివాసీ సోదర–సోదరీమణులందరికీ సమ్మక్క–సారలమ్మ జాతర శుభాకాంక్షలు తెలిపారు.

“గుడిలేని తల్లులను గుండెనిండా నింపుకుని జరుపుకునే అతిపెద్ద ఆదివాసీ పండుగ మేడారం జాతర. ఈ జాతర కోసం చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి స్థాయిలో సంతృప్తినిచ్చాయి. 2023 ఫిబ్రవరి 6న మేడారం సందర్శించినప్పుడు ఈ ప్రాంతాన్ని ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం” అని సీఎం పేర్కొన్నారు.

వంద రోజుల్లో పనులు పూర్తి చేయాలన్న నిర్ణయంపై మొదట ఆశ్చర్యం వ్యక్తమైందని, అయితే జాతర ప్రారంభమయ్యే జనవరి 28 నాటికి అన్ని పనులు పూర్తిచేశామని తెలిపారు. సమ్మక్క–సారలమ్మ ఆలయ పునరుద్ధరణ తన జీవితకాలంలో మరిచిపోలేని అనుభూతిగా నిలుస్తుందని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేశామా అని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు తృప్తినిచ్చే ఘట్టమిదని పేర్కొన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గానీ, తెలంగాణలో గానీ హైదరాబాద్ వెలుపల ఎప్పుడూ మంత్రివర్గ సమావేశం జరగలేదని, అలాంటి చారిత్రక సమావేశాన్ని ఆదివాసీల ఆరాధ్య దైవమైన సమ్మక్క–సారలమ్మ పుణ్యక్షేత్రం మేడారంలో నిర్వహించడంపై మంత్రివర్గ సహచరులందరూ ఆనందం వ్యక్తం చేశారని సీఎం వెల్లడించారు. మంగళవారం ఉదయం ఆలయాన్ని ప్రారంభించి భక్తులకు అంకితం చేస్తామని ఆయన తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793