భార్య నిద్రలో ఉండగానే రోకలిబండతో మోది హత్య
హైదరాబాద్ సిటీ, జనవరి 21: భార్యపై అనుమానంతో రగిలిపోయిన భర్త ఆమెను నిద్రలో ఉండగానే రోకలిబండతో మోది అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. హత్య అనంతరం మృతదేహంతో సెల్ఫీ తీసుకొని వాట్సాప్ స్టేటస్‌గా పెట్టి నిందితుడు పరారయ్యాడు.
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌కు చెందిన సరస్వతి (32)కి, వనపర్తి జిల్లా చింతకుంట గ్రామానికి చెందిన రొడ్డె ఆంజనేయులుతో 2012లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న ఆంజనేయులు కుటుంబంతో కలిసి రాజీవ్ గాంధీనగర్‌లో నివాసం ఉంటున్నాడు.
భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానిస్తూ ఆంజనేయులు తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలో పలుమార్లు సరస్వతిపై దాడి కూడా చేశాడు. భర్త వేధింపులు తాళలేక కొంతకాలం ఆమె తల్లి ఇంటికి వెళ్లింది. కుటుంబ సభ్యులు సర్దిచెప్పడంతో సంక్రాంతి తర్వాత ఈ నెల 17న పిల్లలతో కలిసి హైదరాబాద్‌కు తిరిగివచ్చింది.
అయితే, భార్యపై కోపంతో రగిలిపోయిన ఆంజనేయులు ఆమెను చంపాలని ముందే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. సోమవారం రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో సరస్వతి పిల్లలతో కలిసి నిద్రిస్తుండగా ఇంట్లో ఉన్న రోకలిబండతో తలపై మోది హత్య చేశాడు.
పిల్లల వీడియోకాల్‌తో వెలుగులోకి ఘటన
ఉదయం నిద్రలేచిన పిల్లలు రక్తపు మడుగులో పడి ఉన్న తల్లిని చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే మేనమామ ప్రశాంత్‌కు ఫోన్ చేశారు. అతడు నమ్మకపోవడంతో వీడియోకాల్ చేసి చూపించారు. దీంతో ప్రశాంత్ వెంటనే డయల్ 100కు సమాచారం అందించాడు.
సమాచారం అందుకున్న బోరబండ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సరస్వతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు ఆంజనేయులు పరారీలో ఉండగా, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
గతంలో బావమరిదిపై కత్తితో దాడి
భార్యను తరచూ కొడుతున్న ఆంజనేయులను సరస్వతి తమ్ముడు ప్రశాంత్ ప్రశ్నించడంతో 2022లో అతడిపై కత్తితో దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆ ఘటనలో అప్పట్లో కేసు కూడా నమోదైంది.

Post a Comment