వీధి కుక్కలపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, జనవరి 21: దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కల అంశం భావోద్వేగభరితమని కొందరు పేర్కొంటున్నప్పటికీ, కోర్టు మాత్రం మనుషుల ప్రాణ భద్రతే అత్యంత ముఖ్యమని స్పష్టం చేసింది.
“మీకు కుక్కలపై అంత ప్రేమ ఉంటే వాటిని మీ ఇంటికి తీసుకెళ్లి పెంచుకోండి. భావోద్వేగం కేవలం కుక్కలపైనేనా? మేం మనుషుల గురించి కూడా సమానంగా ఆందోళన చెందుతున్నాం. వీధుల్లో తిరుగుతూ ప్రజలను భయపెట్టే పరిస్థితిని మేం అంగీకరించబోం” అని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
అలాగే, “ఏదైనా సంస్థ వీధి కుక్కలకు ఆహారం పెడుతుంటే, ఆ కుక్కల దాడిలో ఓ చిన్నారి మరణిస్తే బాధ్యత ఎవరిది? ఆ ప్రాణనష్టానికి సంబంధిత సంస్థ బాధ్యత వహించాల్సి ఉంటుందా?” అని ప్రశ్నించింది.
వీధి కుక్కల బెడదను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైతే, ప్రతి కుక్క కాటు, ప్రతి మరణానికి గానూ భారీ పరిహారం చెల్లించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది.
ఇప్పటికే గతేడాది నవంబరులోనే, విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, క్రీడా సముదాయాలు వంటి బహిరంగ ప్రదేశాల సమీపంలో ఉన్న వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది..

Post a Comment