భారీగా ఎన్‌డీపీఎల్ మద్యం పట్టివేత
హైదరాబాద్, జనవరి 21: సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో భారీగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్‌డీపీఎల్) మద్యం పట్టుబడింది. రూ.8.15 లక్షల విలువైన మొత్తం 262 మద్యం బాటిళ్లను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేసి, మద్యం తరలిస్తున్న ఆటో ట్రాలీని సీజ్ చేశారు.
వివరాల్లోకి వెళితే…
సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని సిక్కు విలేజ్‌లో ఉన్న ఇంపీరియల్ గార్డెన్‌లో ఓ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. అతిథులకు మద్యం విందు ఏర్పాటు చేయడానికి తెలంగాణ మద్యం కాకుండా తక్కువ ధరలకు లభించే ఎన్‌డీపీఎల్ (నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్)ను వినియోగిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖకు సమాచారం అందింది.
ఈ మేరకు సోమవారం రాత్రి సికింద్రాబాద్ ఎక్సైజ్ సీఐ జగన్మోహన్ రెడ్డి సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మొత్తం 262 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. మద్యం తీసుకువచ్చిన ఆటో ట్రాలీని సీజ్ చేసి, పాడేరు శ్రీధర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అలాగే ఫంక్షన్ నిర్వాహకుడికి సంబంధించిన శ్యామ్ జోసెఫ్ అనే వ్యక్తిపై కూడా కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
పట్టుబడిన మద్యం వివరాలు
- 44 బాటిళ్లు: ఎయిర్‌పోర్ట్ నుంచి తెచ్చిన డ్యూటీ ఫ్రీ మద్యం
- 23 బాటిళ్లు: గోవా నుంచి తెచ్చిన మద్యం
- 191 బాటిళ్లు: డిఫెన్స్‌కు సంబంధించిన మద్యం
- తెలంగాణకు చెందిన మద్యం: కేవలం 2 బాటిళ్లు మాత్రమే
మొత్తం స్వాధీనం చేసుకున్న మద్యం విలువను రూ.8.15 లక్షలుగా అధికారులు అంచనా వేశారు.
ఈ దాడిలో ఎక్సైజ్ సీఐతో పాటు ఎస్‌ఐ దామోదర్, కానిస్టేబుల్స్ నాగరాజు, ప్రసాద్, రవి పాల్గొన్నారు.
అధికారుల హెచ్చరిక
ఫంక్షన్ నిర్వహణకు ఈవెంట్ పర్మిట్ తీసుకున్నప్పటికీ, తెలంగాణ మద్యానికి బదులు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వినియోగించడం నేరమని సీఐ స్పష్టం చేశారు. తెలంగాణలో ఫంక్షన్లు నిర్వహించేవారు తప్పనిసరిగా అనుమతులు తీసుకుని, తెలంగాణ మద్యాన్నే వినియోగించాలి అని హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి సూచించారు.
ఎన్‌డీపీఎల్ మద్యం పట్టుకున్న ఎక్సైజ్ సీఐ జగన్మోహన్ రెడ్డితో పాటు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

Post a Comment