-->

డ్రైవర్ సీట్లోనే కుప్పకూలిన మరో ఆర్టీసీ డ్రైవర్..!

డ్రైవర్ సీట్లోనే కుప్పకూలిన మరో ఆర్టీసీ డ్రైవర్..!


హైదరాబాద్, జనవరి 26: డ్రైవర్ల రిటైర్మెంట్లు పెరుగుతుండగా, కొత్త రిక్రూట్‌మెంట్ లేకపోవడం వల్ల విధుల్లో ఉన్న డ్రైవర్లపై పని భారం రోజురోజుకూ పెరుగుతోంది. ఒకవైపు మానసిక ఒత్తిడి, మరోవైపు తీవ్రమైన శారీరక శ్రమ కారణంగా పలువురు డ్రైవర్లు స్టీరింగ్‌పైనే ప్రాణాలు విడిచే పరిస్థితి నెలకొంది.

రాష్ట్రవ్యాప్తంగా గత ఆరు నెలల వ్యవధిలో విధుల్లో ఉండగానే గుండెపోటుతో ఐదుగురు ఆర్టీసీ డ్రైవర్లు మృతి చెందగా, మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటనలు నమోదయ్యాయి.

ఈ క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో సోమవారం ఉదయం మరో విషాద ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు డ్రైవర్ డ్యూటీలో ఉండగానే గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందారు.

చౌటుప్పల్ సమీపంలో డ్రైవర్‌కు ఛాతిలో నొప్పి రావడంతో బస్సును రోడ్డుపక్కకు ఆపారు. విషయం గమనించిన ప్రయాణికులు వెంటనే అతన్ని ఆటోలో సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

మృతుడిని విజయవాడ డిపోలో పనిచేస్తున్న గొల్లపూడికి చెందిన నాగరాజు (38)గా గుర్తించారు. ఆయనకు భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మియాపూర్ నుంచి అమరావతి మీదుగా విజయవాడకు వెళ్తున్న బస్సులో ఈ విషాద ఘటన జరిగింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793