-->

పునరాలోచన లేదు… నా రాజీనామాను ఆమోదించండి : ఎమ్మెల్సీ కవిత

శాసన మండలిలో భావోద్వేగ ప్రసంగం – కన్నీళ్లతో రాజీనామా ప్రకటన


హైదరాబాద్, జనవరి 05: ఎమ్మెల్సీ కవిత శాసన మండలిలో భావోద్వేగంగా ప్రసంగించారు. తన రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలను సభ్యుల ముందు వివరించేటప్పుడు ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తన రాజీనామాపై ఎలాంటి పునరాలోచన లేదని స్పష్టం చేస్తూ, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు.

నాలుగు కోట్ల మంది ప్రజలకు కేవలం 40 మంది ఎమ్మెల్సీలు మాత్రమే ఉంటారని పేర్కొన్న కవిత, అలాంటి గౌరవప్రదమైన అవకాశం తనకు కల్పించిన నిజామాబాద్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీతో ఏర్పడిన విభేదాల కారణంగానే తాను ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినట్లు వెల్లడించారు.

తాను 20 ఏళ్లుగా ప్రజాజీవితంలో కొనసాగుతున్నానని, 2006లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర రాజకీయాల్లో ఒక శక్తిగా ఎదిగిందని గుర్తు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పేలా బతుకమ్మ ఉద్యమాన్ని ఊరూరా నిర్వహించామని, తెలంగాణ భాష, యాస, ఆత్మగౌరవం కోసం పోరాటాలు చేశామని చెప్పారు.

2004లో అమెరికాలో ఉద్యోగం చేసిన తాను, తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ పిలుపు మేరకు విదేశాల్లో ఉన్న అనేక మంది యువతతో పాటు స్వదేశానికి తిరిగొచ్చానని తెలిపారు. 2013లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ అధిష్టానం కేసీఆర్‌ను ఢిల్లీకి ఆహ్వానించిందని, ఆగస్టు 2013 నుంచి సాగిన పోరాటాల ఫలితంగా 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందని కవిత గుర్తు చేశారు.

రాజకీయాల్లోకి రావడానికి ముందు తన కుటుంబంతో, భర్తతో సంపూర్ణంగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. జాతీయ పార్టీలపై ఆధారపడకుండా 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని, పార్టీ అప్పగించిన ప్రతి బాధ్యతను ప్రజల కోసం నిబద్ధతతో నిర్వర్తించానని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి బతుకమ్మ పండుగ నుంచే తనపై ఆంక్షలు మొదలయ్యాయని, కక్షపూరితంగా తనను పార్టీ నుంచి బయటకు పంపించారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఏమాత్రం సంప్రదించకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేశారని, కేసీఆర్‌పై కక్షతోనే తనను జైలుకు పంపించారని ఆరోపించారు. మూడు సంవత్సరాల పాటు ఈడీ, సీబీఐ కేసులతో ఒంటరిగా పోరాడినా, ఆ సమయంలో పార్టీ నుంచి తగిన మద్దతు లభించలేదని అన్నారు.

బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఆ పార్టీ ద్వారా పొందిన ఎమ్మెల్సీ పదవిని కొనసాగించడం నైతికంగా సరైంది కాదని భావించి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానని చెబుతూ, తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని మండలి చైర్మన్‌ను కోరారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793