కస్తూర్బా గాంధీ పాఠశాలలో అనుమానాస్పదంగా విద్యార్థిని మృతి
సిద్దిపేట, జనవరి 03: సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామ శివారులోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో అనుమానాస్పద పరిస్థితుల్లో ఓ విద్యార్థిని మృతి చెందడం కలకలం రేపింది. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
శుక్రవారం రాత్రి రోజువారీగా భోజనం చేసిన అనంతరం హాస్టల్‌లో తోటి విద్యార్థినులతో కలిసి ఆడుకుంటున్న హర్షిణి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇది గమనించిన తోటి విద్యార్థినులు వెంటనే ఉపాధ్యాయులకు సమాచారం అందించారు.
అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది హుటాహుటిన బాలికను సిద్దిపేటలోని సురభి మెడికల్ కాలేజ్‌కు తరలించారు. అయితే అక్కడ వైద్యులు పరీక్షించి, అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు.
ఈ విషయం తెలుసుకున్న పాఠశాల యాజమాన్యం వెంటనే బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. అనంతరం హర్షిణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, సిఐ విద్యాసాగర్ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించారు. విద్యార్థిని మృతికి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉందని, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనతో పాఠశాలలో విషాద ఛాయలు అలుముకోగా, బాలిక తల్లిదండ్రులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. విద్యార్థిని మృతి అనుమానాస్పదంగా ఉండటంతో సమగ్ర విచారణ జరపాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Post a Comment