ఇంజక్షన్‌లో గడ్డిమందు వేసుకుని జూనియర్ డాక్టర్ ఆత్మహత్యయత్నం
సిద్దిపేట, జనవరి 4: సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో పనిచేస్తున్న ఓ జూనియర్ డాక్టర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన కలకలం రేపింది. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన బి. లావణ్య (జూనియర్ డాక్టర్) శనివారం అర్ధరాత్రి నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది.
లావణ్య సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో హౌస్ సర్జన్ పూర్తి చేసి, ప్రస్తుతం సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఇంటర్న్‌షిప్ చేస్తోంది. శుక్రవారం ఉదయం విధుల్లో ఉండగా అస్వస్థతకు గురైన ఆమె చికిత్స తీసుకొని అనంతరం కాలేజీ హాస్టల్‌కు వెళ్లినట్లు సమాచారం.
శనివారం ఉదయం ఆమె పారాక్వాట్ అనే గడ్డిమందును ఇంజక్షన్ రూపంలో తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. విషయం గమనించిన తోటి జూనియర్ డాక్టర్లు వెంటనే ఆమెను సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌కు రిఫర్ చేశారు.
నిమ్స్‌లో వైద్యులు తీవ్రంగా చికిత్స అందించినప్పటికీ, శనివారం అర్ధరాత్రి ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
ఇంటర్న్‌షిప్ భారం, అలాగే నీట్ పీజీ పరీక్షల సిద్ధత కారణంగా ఏర్పడిన మానసిక ఒత్తిడే ఈ దుర్ఘటనకు కారణమై ఉండవచ్చని మెడికల్ కాలేజీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే దీనిపై పూర్తి వివరాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.
ఈ ఘటనపై వైద్యురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు సిద్దిపేట త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.
ఈ విషాద ఘటన వైద్య వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. యువ వైద్యులపై పెరుగుతున్న పని ఒత్తిడి, పోటీ పరీక్షల భారం పట్ల చర్చకు దారితీస్తోంది.
⚠️ గమనిక:మానసిక ఒత్తిడి, నిరాశ అనుభవిస్తున్న వారు ఒంటరిగా భావించవద్దు. సహాయం అందుబాటులో ఉంది.ఆత్మహత్య నివారణ హెల్ప్‌లైన్ – 9152987821 (24x7)అవసరమైతే సమీప వైద్యులు లేదా నమ్మకమైన వ్యక్తులను సంప్రదించండి.

Post a Comment