మున్సిపల్ ఎన్నికల కోలాహలం.. పార్టీల టికెట్ల కోసం తీవ్ర పోటీ!
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ముమ్మరం చేయడంతో నిజామాబాద్ జిల్లా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. జిల్లా కేంద్రంలోని ఇందూరు మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది. ఈ నెలాఖరులో నోటిఫికేషన్ విడుదలై, ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయన్న సంకేతాలతో రాజకీయ పార్టీల్లో చలనం కనిపిస్తోంది.
నోటిఫికేషన్‌కు ముందే రాజకీయం వేడెక్కింది
ఇప్పటికే గ్రామపంచాయతీ ఎన్నికలు ముగియడంతో, ఎన్నికల కమిషన్ మున్సిపల్ ఎన్నికల దిశగా అడుగులు వేస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వార్డుల వారీగా ఆశావాహుల వివరాలను సేకరించి వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. నోటిఫికేషన్ వెలువడకముందే మున్సిపల్ పరిధిలో రాజకీయ చర్చలు జోరుగా సాగుతున్నాయి.
గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల వ్యూహాలు
ఇందూరు కార్పొరేషన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీల్లో గెలుపే లక్ష్యంగా మూడు ప్రధాన పార్టీలకు చెందిన నియోజకవర్గ స్థాయి నాయకులు స్థానిక నాయకులతో మంతనాలు సాగిస్తున్నారు. ఈ నెల రెండో వారాంతంలో రిజర్వేషన్లు ఖరారయ్యే అవకాశం ఉండటంతో ఆశావాహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
టికెట్ల కోసం పోటీ.. పార్టీ మార్పులకూ సిద్ధం
టికెట్లు దక్కించుకునేందుకు స్థానిక నాయకులు ప్రధాన నేతల చుట్టూ తిరుగుతూ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అవసరమైతే పార్టీ మారైనా సరే టికెట్ సాధించి పోటీ చేయాలన్న దృఢ సంకల్పంతో పలువురు ముందుకు సాగుతున్నట్లు జిల్లాలో చర్చ జరుగుతోంది. కొన్నిచోట్ల ఒక్కో వార్డులో పలువురు ఆశావాహులు ఉండటంతో పోటీ మరింత తీవ్రంగా మారింది.
కాంగ్రెస్‌కు గ్రామపంచాయతీ ఎన్నికల ఊపు?
ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు మెజారిటీగా విజయం సాధించడంతో, అదే ఊపుతో మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నెల చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు
ఇటీవల అధికారులు ఓటర్ల జాబితాను విడుదల చేయగా, అందులో అనేక తప్పులు ఉన్నాయని అన్ని పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు అధికారులకు ఫిర్యాదులు అందించగా, వాటిపై సవరణ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. త్వరలోనే తుది ఓటర్ల జాబితాను విడుదల చేసి, అనంతరం వార్డుల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు.
మాజీలు, ఓడినవారు మళ్లీ రంగంలోకి
గతంలో కార్పొరేటర్లు, కౌన్సిలర్లుగా పనిచేసిన మాజీలు మరోసారి పోటీ చేసేందుకు సిద్ధమవుతుండగా, గత ఎన్నికల్లో ఓటమి చెందిన అభ్యర్థులు కూడా ఈసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ముందుకొస్తున్నారు. పార్టీ మారినా సరే ప్రజల సానుభూతి తమవైపే ఉంటుందన్న ఆశతో వారు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
పార్టీల గుర్తులపై ఎన్నికలు
గ్రామపంచాయతీ ఎన్నికల మాదిరిగా కాకుండా, ఈ మున్సిపల్ ఎన్నికలు పార్టీల గుర్తులపై జరగనున్నాయి. దీంతో ప్రధాన పార్టీల టికెట్లు పొందేందుకు ఆశావాహులు నియోజకవర్గ ఇన్‌చార్జీలు, స్థానిక ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. టికెట్ దక్కని వారు స్వతంత్రులుగా పోటీ చేసే అవకాశమూ లేకపోలేదు.
ఆర్మూర్ మున్సిపల్‌లో ప్రత్యేక రాజకీయ చర్చ
ఆర్మూర్ మున్సిపల్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, అప్పటి బీఆర్ఎస్ పాలకవర్గానికి చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. అయితే పీసీసీ నుంచి డీసీసీలకు వచ్చిన ఆదేశాల ప్రకారం, గతంలో కాంగ్రెస్‌లో ఉన్నవారికి 80 శాతం టికెట్లు, కొత్తగా చేరిన వారికి 20 శాతం మాత్రమే కేటాయించనున్నారన్న సమాచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో పూర్వ కాంగ్రెస్ నాయకులు సమావేశాలు కూడా నిర్వహించారు.
అలాగే ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, తాను ఎమ్మెల్యేగా గెలవడానికి బీజేపీలో ఉండి పనిచేసిన కార్యకర్తలకే టికెట్లు ఇస్తానని గతంలో ప్రకటించినట్లు సమాచారం. దీంతో ఆర్మూర్‌లో కాంగ్రెస్, బీజేపీ పార్టీల టికెట్లు ఎవరి చేతికి దక్కనున్నాయోనన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది.

Post a Comment