ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం.. 20 మందికి తీవ్రగాయాలు
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. Telangana State Road Transport Corporation (ఆర్టీసీ)కి చెందిన ఓ ప్రయాణికుల బస్సు గద్వాల జిల్లాలో అదుపుతప్పి గుంతలో పడింది. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున ఇటిక్యాలపాడు సమీపంలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం, హైదరాబాద్ నుంచి అనంతపురం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఉండవెల్లి మండల పరిధిలో ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు రహదారి పక్కనున్న గుంతలో పడినట్లు ప్రాథమిక సమాచారం.
ఈ ప్రమాదంలో 20 మందికిపైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, వారు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
బాధితుల్లో పలువురికి కాళ్లు, చేతులు విరిగినట్లు సమాచారం. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Post a Comment