షాబాద్ ఆరు హత్యల కేసు: మోస్ట్ వాంటెడ్ నిందితుడు రాజ్‌కుమార్ ఆత్మహత్య
షాబాద్ ఆరు హత్యల కేసు: మోస్ట్ వాంటెడ్ నిందితుడు రాజ్‌కుమార్ ఆత్మహత్య
హైదరాబాద్, జూలై 13: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షాబాద్ ఆరు హత్యల కేసులో ప్రధాన నిందితుడైన రాజ్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్తూరు మండలం పంజర్ల గ్రామ శివారులోని ఓ వెంచర్ సమీపంలో అతడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రాజ్‌కుమార్ మృతదేహం పక్కనే విషం బాటిల్ లభ్యమైంది. దీంతో అతడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
రాజ్‌కుమార్ గతంలో ఓ బాలికపై లైంగిక దాడి కేసులో పోక్సో చట్టం కింద అరెస్టై జైలుకు వెళ్లాడు. అనంతరం బెయిల్‌పై విడుదలైన అతడు తీవ్ర కక్షతో బాధిత బాలిక, ఆమె తల్లి, నానమ్మతో పాటు తన భార్య, ఇద్దరు చిన్నారులను అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
నిందితుడిని పట్టుకునేందుకు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పోలీసులు సుమారు 14 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా గాలింపు చేపట్టారు. అతడి ఆచూకీ తెలిపిన వారికి రూ.2 లక్షల నగదు బహుమతి కూడా ప్రకటించారు.
పోలీసుల విస్తృత గాలింపు చర్యలతో ఎక్కడా ఆశ్రయం దొరకకపోవడంతో రాజ్‌కుమార్ తన మేనమామ స్వగ్రామమైన పంజర్లకు చేరుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అక్కడే పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఈ ఘటనతో షాబాద్ ఆరు హత్యల కేసులో నిందితుడి కోసం కొనసాగుతున్న భారీ గాలింపు చర్యలకు ముగింపు లభించింది. అయితే, అతడి ఆత్మహత్యకు సంబంధించిన పరిస్థితులపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Post a Comment