పల్లెవెలుగు బస్సులో కండక్టర్ ను పొట్టు పొట్టు కొట్టిన నలుగురు మహిళలు
నెల్లూరు జిల్లా, పొదలకూరు: పల్లెవెలుగు బస్సులో కండక్టర్‌పై నలుగురు మహిళలు దాడి చేసిన ఘటన నెల్లూరు జిల్లా పొదలకూరులో చోటుచేసుకుంది. బస్సు ఆపాలని కోరిన మహిళలకు కండక్టర్ నిరాకరించడంతో వాగ్వాదం జరిగి, అది చివరకు ఘర్షణకు దారితీసింది.
వివరాల ప్రకారం.. గూడూరు డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సు పొదలకూరు నుంచి గూడూరు వెళ్తుండగా, పంచాయతీ బస్టాండ్ వద్ద సైదాపురానికి చెందిన నలుగురు మహిళలు బస్సు ఎక్కారు. బస్సు బయలుదేరిన అనంతరం తమ బంధువులు వస్తున్నారని, కొద్దిసేపు బస్సు ఆపాలని వారు కండక్టర్ హస్సేన్‌ను కోరారు.
అయితే అప్పటికే సుమారు 80 మంది ప్రయాణికులతో బస్సు నిండిపోయిందని, వెనుక వచ్చే బస్సులో రావాలని కండక్టర్ సూచించారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా, ఆగ్రహానికి గురైన మహిళలు కండక్టర్‌పై దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనలో కండక్టర్ చొక్కా చించబడగా, మెడ భాగంలో గాయాలయ్యాయి.
గాయపడిన కండక్టర్ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నలుగురు మహిళలపై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై విచారణ చేపట్టినట్లు సమాచారం.
ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. ఈ కారణంగా సీట్ల విషయంలో, బస్సు నిలిపివేత వంటి అంశాలపై అప్పుడప్పుడు వివాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆర్టీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం పొదలకూరు ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

Post a Comment