యువకుడి మర్మాంగాలు నలిపి దారుణ హత్య.. స్నేహితులే నిందితులు
యువకుడి మర్మాంగాలు నలిపి దారుణ హత్య.. స్నేహితులే నిందితులు
హైదరాబాద్: నగరంలోని పసుమాముల ప్రాంతంలో 22 ఏళ్ల యువకుడిని అతని స్నేహితులే అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. గంజాయి వ్యాపారంలో తలెత్తిన వివాదాలు, అలాగే ఓ యువతి విషయంలో ఏర్పడిన గొడవ ఈ హత్యకు కారణమైనట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు.
మృతుడు నిషాని సుహాస్ (22) తన తల్లితో కలిసి పసుమాములలో నివసిస్తున్నాడు. గతంలో కుటుంబం సికింద్రాబాద్‌లో ఉండేది. అయితే కొడుకు చెడు అలవాట్లకు బానిసవుతున్నాడనే ఆందోళనతో, భర్త మరణానంతరం కుమార్తెకు వివాహం చేసి, పసుమాములలో సొంత ఇల్లు కొనుగోలు చేసి అక్కడికి నివాసం మార్చినట్లు సమాచారం. సుహాస్ గంజాయికి బానిస కావడంతో పాటు గంజాయి వ్యాపారంలో కూడా పాల్గొంటున్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం, సుహాస్ వద్ద మొబైల్ ఫోన్ లేకపోవడంతో తన స్నేహితులు రాకేష్, పరుశురాం, రాజులో ఒకరి ఫోన్ తీసుకుని, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ యువతికి అసభ్యకర సందేశాలు పంపాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి తన ప్రియుడికి చెప్పడంతో సుహాస్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఇదే సమయంలో గంజాయి వ్యాపారానికి సంబంధించిన పాత లావాదేవీల వివాదాలు కూడా బయటకు రావడంతో అతనితో గొడవలు మరింత ముదిరాయి.
ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున మాట్లాడాల్సి ఉందని చెప్పి సుహాస్‌ను ఊరి శివారులోని మర్రిచెట్టు వద్దకు తీసుకెళ్లిన రాకేష్, పరుశురాం, రాజు, మరో వ్యక్తి కలిసి అతనిపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రాణభయంతో అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించినా వెంటపడి తీవ్రంగా కొట్టిన నిందితులు, అతని మర్మాంగాలపై కూడా దారుణంగా దాడి చేసి మృతి చెందే వరకు కొట్టినట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం అక్కడే మృతదేహాన్ని వదిలి పరారైనట్లు పోలీసులు పేర్కొన్నారు.
సుహాస్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసిన పోలీసులు, పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Post a Comment