-->

అర్థరాత్రి ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్న 17 మంది గురుకుల విద్యార్థులు.. హాస్టల్ వసతులపై ఆవేదన

 

అర్థరాత్రి ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్న 17 మంది గురుకుల విద్యార్థులు.. హాస్టల్ వసతులపై ఆవేదన

అర్థరాత్రి ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్న 17 మంది గురుకుల విద్యార్థులు.. హాస్టల్ వసతులపై ఆవేదన

మంచిర్యాల: మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 17 మంది విద్యార్థులు హాస్టల్‌లో సరైన వసతులు లేకపోవడంతో అర్థరాత్రి హాస్టల్‌ను విడిచి ఎమ్మెల్యే ఇంటికి వెళ్లడం జిల్లాలో చర్చనీయాంశమైంది.

సమాచారం ప్రకారం, ఈ 17 మంది విద్యార్థులు గత విద్యా సంవత్సరంలో లక్షెట్టిపేట మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పూర్తి చేశారు. ఈ ఏడాది వారిని ద్వితీయ సంవత్సరం చదువుల కోసం చెన్నూర్ గురుకుల కళాశాలకు అధికారులు బదిలీ చేశారు. అయితే కొత్త హాస్టల్‌లో కనీస వసతులు, అవసరమైన సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైన విద్యార్థులు తమ సమస్యలను నేరుగా ప్రజాప్రతినిధికి తెలియజేయాలని నిర్ణయించారు.

దీంతో రాత్రి 9 గంటల సమయంలో చెన్నూర్ నుంచి ఆర్టీసీ బస్సులో మంచిర్యాలకు చేరుకున్న విద్యార్థులు నేరుగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు నివాసానికి వెళ్లారు. ఆ సమయంలో ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో ఆయన సతీమణి కొక్కిరాల సురేఖను కలిసి హాస్టల్‌లో ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.

విద్యార్థుల గోడును ఓర్పుగా విన్న సురేఖ వెంటనే సంబంధిత అధికారులు, కళాశాల అధ్యాపకులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేసి, జిల్లా కోఆర్డినేటింగ్ అధికారి (డీసీఓ) శ్రీధర్‌కు అప్పగించి టాటా ఏస్ వాహనంలో తిరిగి చెన్నూర్ హాస్టల్‌కు పంపించారు.

ఇదిలా ఉండగా, 17 మంది విద్యార్థులు హాస్టల్‌ను విడిచి వెళ్లినప్పటికీ వారి తల్లిదండ్రులకు హాస్టల్ సిబ్బంది ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించారని మండిపడుతున్నారు.

మరోవైపు, విద్యార్థులను సొంత పిల్లల్లా ఆదరించి, భోజనం పెట్టించి, వారి సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుని తిరిగి హాస్టల్‌కు పంపించిన ఎమ్మెల్యే సతీమణి కొక్కిరాల సురేఖను పలువురు తల్లిదండ్రులు అభినందించారు. గురుకులాల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793