ప్లాస్టిక్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం.. మూడు ఫైర్ ఇంజిన్లతో మంటల అదుపు
ప్లాస్టిక్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం.. మూడు ఫైర్ ఇంజిన్లతో మంటల అదుపు
రంగారెడ్డి, జూలై 15: రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందనవనంలో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మెట్రో బార్ సమీపంలోని ఓ ప్లాస్టిక్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, క్షణాల్లోనే తీవ్రరూపం దాల్చాయి.
గోదాంలో ప్లాస్టిక్ సామగ్రి భారీగా నిల్వ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించి, పక్కనే ఉన్న మరో గోదాంతో పాటు సమీప భవనాలకు కూడా అంటుకున్నాయి. దట్టమైన పొగలు ఎగసిపడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే మూడు అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని, గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో మంటలు మరింత విస్తరించకుండా నిలువరించగలిగారు.
ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ, ఇతర కోణాల్లో కూడా అధికారులు విచారణ చేపడుతున్నారు. ఘటనపై మీర్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Post a Comment