తూప్రాన్‌లో చోరీ కేసు ఛేదన.. 12 గంటల్లోనే నిందితుడి అరెస్ట్
తూప్రాన్‌లో చోరీ కేసు ఛేదన.. 12 గంటల్లోనే నిందితుడి అరెస్ట్
రూ.7 లక్షల నగదు, వెండి ఆభరణాలు స్వాధీనం.. పోలీసు బృందాన్ని అభినందించిన ఎస్పీ
మెదక్, జూలై 15: తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ కేసును పోలీసులు కేవలం 12 గంటల్లోనే ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.7 లక్షల నగదు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. వేగంగా కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ అభినందిస్తూ రివార్డు ప్రకటించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు గంజి పాండురంగం (50) తన కుమార్తె వివాహం కోసం దాచిపెట్టిన రూ.7 లక్షల నగదు, వెండి ఆభరణాలను జూలై 14న గుర్తుతెలియని వ్యక్తి దొంగిలించాడు. దీంతో బాధితుడు తూప్రాన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
డీఎస్పీ జె. నరేందర్ గౌడ్ ఆదేశాల మేరకు, రామాయంపేట సీఐ (ఇన్‌చార్జ్ తూప్రాన్) బి. సైదా నాయక్, తూప్రాన్ ఎస్ఐ వి. గంగరాజు నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారాన్ని వినియోగించి ముమ్మరంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేవలం 12 గంటల్లోనే నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టైన నిందితుడు వల్లపు రాజు (32), తండ్రి రాములు. ఇతడు సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం అంబర్‌పేట్ గ్రామానికి చెందినవాడు కాగా, ప్రస్తుతం మెదక్ జిల్లా మాసాయిపేట్ మండలం వడ్డెర కాలనీలో నివాసం ఉంటున్నాడు. కూలీగా పనిచేస్తున్న అతనిపై గతంలో కూడా రెండు చోరీ కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.
నిందితుడి వద్ద నుంచి రూ.7 లక్షల నగదు, ఒక జత వెండి కాళ్ల పట్టీలు, రెండు జతల వెండి మెట్టెలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆస్తి మొత్తం విలువ సుమారు రూ.7,03,000గా పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా పోలీసులు ప్రజలకు పలు సూచనలు చేశారు. ఇళ్లలో అధిక మొత్తంలో నగదు, విలువైన బంగారం, వెండి ఆభరణాలను భద్రంగా ఉంచుకోవాలని, ఇల్లు ఖాళీగా వదిలి వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.
ఈ కేసును విజయవంతంగా ఛేదించిన బృందంలో ఎస్ఐలు వి. గంగరాజు, చైతన్య రెడ్డి, కానిస్టేబుళ్లు రాజు, మహేష్, నర్సింలు, చంద్రం ప్రసాద్, సాయిబాబా, వెంకటేష్, సతీష్, నారాయణరావు, పాషా పాల్గొన్నారు. వారి కృషిని మెచ్చుకున్న మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందిస్తూ తగిన రివార్డును ప్రకటించారు.

Post a Comment