-->

మోడల్ స్కూల్‌లో విషాదం.. బావిలో పడి 8వ తరగతి విద్యార్థి మృతి

 

మోడల్ స్కూల్‌లో విషాదం.. బావిలో పడి 8వ తరగతి విద్యార్థి మృతి

మోడల్ స్కూల్‌లో విషాదం.. బావిలో పడి 8వ తరగతి విద్యార్థి మృతి

పెద్దపల్లి జిల్లా: పెద్దపల్లి జిల్లాలోని ఓ మోడల్ స్కూల్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుతూ బంతి తీసుకురావడానికి బావిలోకి దిగిన 8వ తరగతి విద్యార్థి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు.

రామగుండం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎన్టీపీసీ ఖాజిపల్లికి చెందిన సాత్విక్ (13) లింగాపూర్ గ్రామ సమీపంలోని మోడల్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు. గురువారం సాయంత్రం తోటి విద్యార్థులతో కలిసి స్కూల్ ఆవరణలో క్రికెట్ ఆడుతుండగా బంతి ప్రహరీ గోడ దాటి సమీపంలోని వ్యవసాయ బావిలో పడింది.

బంతిని తీసుకురావడానికి సాత్విక్‌తో పాటు మరో ముగ్గురు విద్యార్థులు ఒకరినొకరు పట్టుకొని బావిలోకి దిగే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో సాత్విక్‌తో పాటు మరో విద్యార్థి బావిలో పడిపోయారు. సాత్విక్ నీటిలో మునిగి అక్కడికక్కడే మృతిచెందగా, మరో విద్యార్థి బావి అంచును పట్టుకుని ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.

విషయం తెలుసుకున్న పీఈటీ వెంటనే అక్కడికి చేరుకుని ప్రమాదంలో చిక్కుకున్న విద్యార్థిని రక్షించాడు. అనంతరం లింగాపూర్ గ్రామస్తుల సహకారంతో పోలీసులు సాత్విక్ మృతదేహాన్ని బావి నుంచి వెలికితీశారు.

ఘటనతో ఆగ్రహించిన విద్యార్థి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు స్కూల్ ఎదుట ఆందోళన చేపట్టారు. పీఈటీ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు.

సమాచారం అందుకున్న గోదావరిఖని ఏసీపీ రమేశ్, పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య, రామగుండం ఎస్సై సంధ్యారాణి సంఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ అధికారులతో మాట్లాడి స్కూల్ ప్రిన్సిపాల్ సదానందంతో పాటు పీఈటీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయించారు.

అలాగే బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతో పాటు ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు తమ ఆందోళనను విరమించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793