-->

మత్తు మందుతో ఘరానా చోరీ.. రూ.20 లక్షలతో వంట మనిషి జంప్

మత్తు మందుతో ఘరానా చోరీ.. రూ.20 లక్షలతో వంట మనిషి జంప్


హైదరాబాద్‌, ఫిబ్రవరి 6: నగరంలోని అత్యంత సంపన్న ప్రాంతమైన జూబ్లీహిల్స్‌లో (Jubilee Hills) ఘరానా చోరీ కలకలం రేపింది. నమ్మకంగా పనిలో చేరిన వంట మనిషి, తోటి పని మనుషులకు మత్తు మందు ఇచ్చి సుమారు రూ.20 లక్షల విలువైన నగదు, నగలతో పరారయ్యాడు.

పోలీసుల వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ పరిధిలోని నందగిరి హిల్స్‌లో ఉన్న ఓ ఇంట్లో భువన్ అనే నేపాలీ యువకుడు సుమారు 15 రోజుల క్రితం వంట మనిషిగా పనిలో చేరాడు. బుధవారం తన పుట్టినరోజు అంటూ ఇంట్లో పనిచేసే ఇతర పని మనుషులు, వాచ్‌మెన్‌ను నమ్మించి వేడుకలు నిర్వహించాడు. ఈ సందర్భంగా అందరికీ కూల్‌డ్రింక్స్ పంపిణీ చేశాడు.

అయితే, కూల్‌డ్రింక్స్‌లో ముందుగానే మత్తు మందు కలిపిన భువన్, అందరూ స్పృహ కోల్పోయిన తర్వాత ఇంట్లోని బీరువాను తెరిచి సుమారు రూ.20 లక్షల విలువైన నగదు, బంగారు ఆభరణాలను దోచుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.

గురువారం ఉదయం ఎంతసేపటికీ పని మనుషులు నిద్ర లేవకపోవడం, వాచ్‌మెన్ అపస్మారక స్థితిలో పడి ఉండటంతో అనుమానం వచ్చిన ఇంటి యజమానులు లోపలికి వెళ్లి పరిశీలించగా చోరీ జరిగినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అపార్ట్‌మెంట్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. నిందితుడు నేపాల్‌కు పారిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులను పోలీసులు అప్రమత్తం చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793