గడువు ముగిసిన మందులు ఇచ్చిన వైద్యులు..? 6 నెలల బాబు మృతి
Hyderabad నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. బండ్లగూడ జాగీరు – సన్‌సిటీ పరిధిలో గడువు ముగిసిన మందులు ఇవ్వడంతో 6 నెలల శిశువు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
స్థానికుల వివరాల ప్రకారం, రాము అనే ఆరు నెలల బాబుకు జ్వరం రావడంతో తల్లిదండ్రులు సమీపంలోని క్రియాన్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు చికిత్స అందించి కొన్ని మందులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఆ మందులు గడువు ముగిసినవేనని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
మందులు ఇచ్చిన కొద్దిసేపటికే బాలుడి ఆరోగ్యం విషమించిందని, పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో మళ్లీ ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే బాబు మృతి చెందినట్లు తల్లిదండ్రులు వాపోతున్నారు. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే తమ బిడ్డ ప్రాణం తీసిందని బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గడువు ముగిసిన మందులు ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంబంధిత ఆరోగ్య శాఖ అధికారులు తక్షణమే విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలని కోరుతున్నారు.
ఇదిలా ఉండగా, ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తరువాతే అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉందని సమాచారం.

Post a Comment