ప్రభుత్వ ఆసుపత్రిలో రేబీస్ టీకా వికటించి చిన్నారి మృతి
కామారెడ్డి: ప్రభుత్వ ఆసుపత్రిలో రేబీస్ నివారణ టీకా వికటించడంతో రెండున్నరేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. వైద్యుల నిర్లక్ష్యమే తమ కూతురు మరణానికి కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.
కామారెడ్డి జిల్లా కొటాల్‌పల్లి గ్రామానికి చెందిన రమేష్–అర్చన దంపతులు జీవనోపాధి నిమిత్తం తమ ఇద్దరు పిల్లలతో కలిసి కామారెడ్డి పట్టణంలో నివాసం ఉంటున్నారు. గత నెల 25వ తేదీన ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో వారి రెండున్నరేళ్ల కూతురు క్రితార్సను వీధి కుక్క కరిచింది. వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు చిన్నారిని కామారెడ్డి ప్రభుత్వ బోధనాసుపత్రికి తరలించారు.
అక్కడ వైద్యులు రేబీస్ నివారణకు అవసరమైన టీకాలు ప్రారంభించగా, ఇటీవల మూడవ డోస్ టీకా ఇచ్చిన అనంతరం చిన్నారిని ఇంటికి పంపించారు. అయితే ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో, సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చిన్నారికి పల్స్ పడిపోయిందని వైద్యులు చెప్పడంతో, కుటుంబ సభ్యులు వెంటనే తిరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకునే సరికి చిన్నారి అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన కుటుంబ సభ్యులు, వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ కూతురు మృతి చెందిందని ఆరోపిస్తూ ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు.
ఈ ఘటనపై చిన్నారి తండ్రి రమేష్ ఫిర్యాదు మేరకు, విధుల్లో ఉన్న వైద్యుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

Post a Comment