-->

రైలు బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి

రైలు బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి


సినిమా చూసేందుకు సరదాగా బయలుదేరిన ముగ్గురు యువకుల జీవితాలు రోడ్డు ప్రమాదంలో అర్థాంతరంగా ముగిశాయి. తిరిగి వస్తారనే ఆశతో ఎదురు చూసిన కుటుంబాల్లో ఈ ఘటన తీరని విషాదాన్ని మిగిల్చింది.

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు రోడ్డు కం రైలు బ్రిడ్జిపై మంగళవారం రాత్రి ఈ హృదయవిదారక ప్రమాదం చోటుచేసుకుంది. కొవ్వూరు పట్టణంలోని శ్రీనివాసపురానికి చెందిన పోతుగుంట అక్షయ్‌కుమార్ (20), కొమిరి ఏడుకొండలు (18), గాజులవారి వీధికి చెందిన తగరపు సత్యకళ్యాణ్ అలియాస్ సునీల్ (20) ముగ్గురు పల్సర్ బైక్‌పై సినిమా చూసేందుకు రాజమండ్రి వైపు బయలుదేరారు.

అదే సమయంలో రాజమండ్రి క్వారీ మార్కెట్ ప్రాంతానికి చెందిన ఆనాపు లక్ష్మీనారాయణ (34) యాక్టివాపై కొవ్వూరు వైపు వస్తుండగా, రోడ్డు కం రైలు బ్రిడ్జి 104వ స్తంభం వద్ద రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో అక్షయ్‌కుమార్, సునీల్, లక్ష్మీనారాయణలకు తలకు తీవ్ర గాయాలు కావడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఏడుకొండలుకు స్వల్ప గాయాలు కావడంతో 108 అంబులెన్స్‌లో కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యవసర చికిత్స నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేశారు.

సమాచారం అందుకున్న వెంటనే పట్టణ సీఐ పి. విశ్వం సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793