పారిశుద్ధ్య కార్మికురాలి నిజాయతీకి సూపర్‌స్టార్ రజనీకాంత్ కానుక
ఫిబ్రవరి 04: చెన్నైకి చెందిన ఓ పారిశుద్ధ్య కార్మికురాలి నిజాయతీకి సినీ సూపర్‌స్టార్ రజనీకాంత్ మనసు కరిగింది. రోడ్డుపై దొరికిన భారీ మొత్తంలో బంగారాన్ని ఎలాంటి ఆశలేకుండా పోలీసులకు అప్పగించిన ఆమెను రజనీకాంత్ ప్రత్యేకంగా అభినందిస్తూ బంగారు గొలుసును కానుకగా అందించారు.
చెన్నై మహానగర పాలక సంస్థలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న పద్మ (50) ఇటీవల విధులు నిర్వహిస్తున్న సమయంలో రోడ్డుపై పడిపోయిన సుమారు 45 తులాల బంగారాన్ని గుర్తించారు. ఆ బంగారాన్ని తన వద్ద ఉంచుకోకుండా వెంటనే పోలీసులకు అప్పగించి యజమానిని గుర్తించేందుకు సహకరించారు.
ఈ ఘటనతో పద్మ నిజాయతీపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. విషయం తెలుసుకున్న సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆమెను స్వయంగా పిలిపించి అభినందనలు తెలియజేశారు. అంతేకాదు, ఆమె నిజాయతీకి గుర్తుగా బంగారు గొలుసును బహుమతిగా అందించి, “సమాజానికి ఆదర్శంగా నిలిచారు” అంటూ ప్రశంసించారు.
పద్మ చేసిన ఈ కార్యం సామాన్యులలోనూ నిజాయతీకి విలువ ఉందని మరోసారి నిరూపించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Post a Comment