-->

తెలంగాణ పురపోరు.. నేటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగింపు

Municipal Elections 2026: తెలంగాణ పురపోరు.. నేటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగింపు


హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో నేడు మరో కీలక దశ ముగియనుంది. నామినేషన్ల ఉపసంహరణకు నిర్ణయించిన గడువు ఇవాళ్టితో పూర్తికానుంది.

రాజకీయ పార్టీల తరఫున పోటీలో ఉన్న అభ్యర్థులు మధ్యాహ్నం 3 గంటల లోపు బీ–ఫారమ్‌లను సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థుల జాబితాను వరుస క్రమంలో సిద్ధం చేసి, వారికి ఎన్నికల గుర్తులు కేటాయించే ప్రక్రియ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఏఐ ఆధారిత టూల్స్‌ను అభివృద్ధి చేసి జిల్లా కలెక్టర్లకు పంపింది.

మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న ఐఏఎస్ అధికారి మకరందు రూపొందించిన “సెక్యూర్” యాప్‌ ద్వారా ఎన్నికల ప్రక్రియను సులభతరం చేసేందుకు ఎస్‌ఈసీ ఏర్పాట్లు చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 22,519 మంది అభ్యర్థులు 29,742 నామినేషన్లు దాఖలు చేయగా, ఇండిపెండెంట్లుగా 3,748 మంది నామపత్రాలు సమర్పించారు. సరైన వివరాలు లేనందున 2,911 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ప్రస్తుతం 19,608 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ నెల 11వ తేదీన పోలింగ్ నిర్వహించనుండగా, అందులో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఎన్నిక కానున్నారు. మున్సిపాలిటీల ఛైర్‌పర్సన్లు, వైస్‌ఛైర్‌పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల పరోక్ష ఎన్నికల కోసం ఈ నెల 14న నోటీసులు జారీ చేయనున్నారు.

ఈ నెల 16న ఉదయం 11 గంటలకు మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు, కార్పొరేషన్లలో కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ఛైర్‌పర్సన్లు, వైస్‌ఛైర్‌పర్సన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నికలు నిర్వహిస్తారు.

మేయర్, మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎన్నికల కోసం ఎక్స్‌అఫీషియో ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కార్పొరేటర్లు, వార్డు కౌన్సిలర్లతో పాటు ఎక్స్‌అఫీషియో సభ్యులకూ ఓటు హక్కు ఉంటుందని స్పష్టం చేశారు.

ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఇప్పటికే నమోదైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వివరాలను పంపించాలని సూచించారు. అలాగే ఈ నెల 11 నుంచి 14 వరకు కొత్తగా నమోదు కావాలనుకునే ప్రజాప్రతినిధుల వివరాలు సేకరించాలని ఆదేశించారు.

ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లేదా ఎంపీకి ఏదైనా ఒక్క మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్‌లో మాత్రమే ఓటు హక్కు ఉంటుందని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. సమావేశానికి కనీసం సగం మంది సభ్యులు హాజరైతే కోరంగా పరిగణిస్తారని, లేకపోతే మరుసటి రోజుకు వాయిదా వేస్తామని తెలిపింది. ఓటింగ్ చేతులెత్తే పద్ధతిలో నిర్వహించబడుతుందని, పార్టీ విప్‌ను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని వెల్లడించింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793