కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం
మెదక్ జిల్లా, ఫిబ్రవరి 21: మెదక్ జిల్లా రేగోడ్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అనుమానంతో 25 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపింది. వీరితో పాటు ఎస్‌ఎస్‌సీ ఇంటర్నల్ మార్క్స్ వెరిఫికేషన్ కోసం వచ్చిన ముగ్గురు ఉపాధ్యాయులు కూడా వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు.
రాత్రి భోజనం తర్వాత లక్షణాలు
గురువారం రాత్రి హాస్టల్‌లో సాధారణంగా భోజనం చేసిన విద్యార్థినులు తెల్లవారు జామున నుంచి వరుసగా వాంతులు, విరేచనాలు చేయడంతో పాఠశాల సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే హాస్టల్ వార్డెన్, ఉపాధ్యాయులు అస్వస్థతకు గురైన వారిని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
ఆసుపత్రిలో చికిత్స.. ప్రమాదం లేదు
మొత్తం 25 మంది విద్యార్థినులకు వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ప్రాథమికంగా ఫుడ్ పాయిజన్ కారణంగానే ఈ ఘటన జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
పోలీసులు, అధికారులు విచారణ
సమాచారం అందుకున్న పోలీసులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకుని విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఘటనపై విచారణ ప్రారంభించారు. భోజన నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించే అవకాశం ఉందని సమాచారం.
పాఠశాలలో హెల్త్ క్యాంప్
చికిత్స అనంతరం విద్యార్థినులను తిరిగి పాఠశాలకు తరలించారు. పాఠశాల ప్రాంగణంలో ప్రత్యేక హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి అవసరమైన వైద్య సేవలు అందించనున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పాఠశాల ప్రిన్సిపాల్ భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Post a Comment