హనుమాన్ దేవాలయ హుండీ చోరీ ఛేదించిన పోలీసులు – పాత నేరస్థుడు అరెస్ట్
తాడ్వాయి: తాడ్వాయి మండల కేంద్రంలో ఉన్న హనుమాన్ దేవాలయంలో జరిగిన హుండీ చోరీ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. గస్తీ సిబ్బంది అప్రమత్తతతో నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతడి వద్ద నుంచి నగదు మరియు చోరీకి ఉపయోగించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 19వ తేదీ తెల్లవారుజామున తాడ్వాయి గ్రామంలోని శబరి మాత ఆశ్రమంకు ఎదురుగా ఉన్న కొండపై వెలసిన హనుమాన్ దేవాలయంలో చోరీ జరిగినట్లు తెలిపారు. ఆలయ పూజారి సత్యానందదాస్ త్యాగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు.
18వ తేదీ రాత్రి ఆలయానికి తాళం వేసి వెళ్లిన పూజారి, మరుసటి రోజు ఉదయం వచ్చి చూసే సరికి ఇనుప హుండీ తాళాలు పగులగొట్టబడినట్లు గుర్తించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఈ నెల 20వ తేదీ శుక్రవారం ఉదయం హెడ్ కానిస్టేబుల్ బాలాజీ, కానిస్టేబుల్ అనిల్ గ్రామంలో గస్తీ నిర్వహిస్తుండగా, ఒక వ్యక్తి పోలీసులను చూసి అనుమానాస్పదంగా ప్రవర్తిస్తూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే సిబ్బంది అతడిని వెంబడించి పట్టుకున్నారు. విచారణలో అతడు పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో పాటు, అతని షర్ట్‌పై తాజా రంగు మరకలు ఉండటాన్ని పోలీసులు గమనించారు. దీంతో అనుమానం పెరగడంతో స్టేషన్‌కు తరలించి లోతుగా విచారించగా అసలు విషయం బయటపడింది.
పాత నేరస్థుడే…
నిందితుడిని లింగంపేట మండలం రాంపూర్ గ్రామానికి చెందిన గోడండ్ల పావులుగా గుర్తించారు. గతంలో ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో ఐదు దేవాలయాల్లో హుండీ చోరీలకు పాల్పడినట్లు విచారణలో తేలిందని ఎస్సై వెల్లడించారు.
గత నెల 28న పాత కేసులో బెయిల్‌పై విడుదలైన నిందితుడు, బుద్ధి మార్చుకోకుండా మళ్లీ తాడ్వాయి హనుమాన్ ఆలయంలో చోరీకి పాల్పడ్డాడని తెలిపారు. అంతేకాక, మరో చోరీకి ప్రణాళిక రచిస్తున్న సమయంలోనే పోలీసులకు చిక్కినట్లు చెప్పారు.
నిందితుడిని అరెస్టు చేసి, దొంగతనానికి ఉపయోగించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Post a Comment