-->

గురుకుల కళాశాలలో విద్యార్థినికి పాము కాటు.. పరిస్థితి విషమం

గురుకుల కళాశాలలో విద్యార్థినికి పాము కాటు.. పరిస్థితి విషమం


మహబూబాబాద్/ఇనుగుర్తి: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో తీవ్ర కలకలం నెలకొంది. గురుకులంలో చదువుతున్న అశ్మిత అనే ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని పాము కాటుకు గురైంది. ఈ ఘటన గురుకుల హాస్టల్ ప్రాంగణంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా హాస్టల్ గదిలో ఉన్న సమయంలో అకస్మాత్తుగా పాము అశ్మితను కాటేసినట్లు తెలుస్తోంది. పాము కాటు తర్వాత విద్యార్థిని ఒక్కసారిగా అస్వస్థతకు గురవ్వడంతో తోటి విద్యార్థులు వెంటనే సిబ్బందికి సమాచారం అందించారు.

పరిస్థితి విషమంగా ఉండటంతో అప్రమత్తమైన గురుకుల సిబ్బంది తక్షణమే అశ్మితను ప్రాథమిక చికిత్స కోసం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం ఆమెను ఇతర ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు సమాచారం.

ప్రస్తుతం విద్యార్థినికి వైద్యులు చికిత్స అందిస్తుండగా, ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై తల్లిదండ్రులు, విద్యార్థుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

ఇదిలా ఉండగా, గురుకుల కళాశాలల భద్రత, పరిసరాల పరిశుభ్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హాస్టల్ ప్రాంగణంలో పాములు తిరుగుతున్నాయంటే విద్యార్థుల ప్రాణాలకే ముప్పు అంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే భద్రతా చర్యలు చేపట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టే అవకాశం ఉంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793