వైద్య శాఖలో అవినీతి ప్రమోషన్‌కు రూ.లక్ష, డిప్యుటేషన్‌కు రూ.3–5 లక్షలు
హైదరాబాద్, మార్చి 14: రాష్ట్ర వైద్య శాఖలో అవినీతి పతాక స్థాయికి చేరిందనే ఆరోపణలు వెలుగుచూస్తున్నాయి. కీలక విభాగంలో పనిచేస్తున్న ఓ కింది స్థాయి అధికారి భారీగా అవినీతి దందా కొనసాగిస్తున్నాడని శాఖ వర్గాలు చెబుతున్నాయి. గతంలో రోస్టర్ విధానంలో అవకతవకలకు పాల్పడి సస్పెన్షన్‌కు గురైనప్పటికీ, పైరవీలతో తిరిగి అదే శాఖలో కీలక స్థానం సంపాదించుకున్నట్లు సమాచారం.
సదరు అధికారి శాఖపై పట్టు సాధించి ప్రమోషన్లు, డిప్యుటేషన్లు, సరెండర్ కేసులు, ఫైళ్ల క్లియరెన్స్‌ల పేరుతో భారీగా వసూళ్లు చేస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రమోషన్‌పై హెడ్ ఆఫీసుకు రావాలనుకునే అధికారులను అడ్డుకునేందుకు చార్జిమెమోలు ఇప్పిస్తుండటంతో పాటు, వాటిని రద్దు చేయాలంటే కూడా భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
నెలకు రూ.30–50 లక్షల వసూళ్లు
ప్రమోషన్‌కు సుమారు రూ.1 లక్ష, డిప్యుటేషన్‌కు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలు, సరెండర్ కేసులకు రూ.5 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చిన్న ఫైళ్ల క్లియరెన్స్‌కే రూ.50 వేల వరకు తీసుకుంటున్నాడని శాఖలో చర్చ జరుగుతోంది. ఈ విధంగా ప్రతినెలా రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు వసూలు చేస్తున్నాడని సమాచారం.
తనకు ప్రమోషన్ వచ్చినప్పటికీ, అధికారి అక్కడికెళ్లకుండా ఇదే శాఖలో కొనసాగుతున్నాడని తెలుస్తోంది. జీతం కంటే ఇక్కడే ఉంటే భారీగా సంపాదించవచ్చనే లెక్కతోనే అతడు అదే స్థానంలో కొనసాగుతున్నాడని సిబ్బంది అభిప్రాయపడుతున్నారు.
పై అధికారుల అండ?
తాను వసూలు చేసిన మొత్తంలో పెద్ద భాగాన్ని కీలక విభాగాధిపతికి అందజేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. శాఖ పెద్దల అండదండలతోనే ఈ వ్యవహారం కొనసాగుతోందని సిబ్బంది చెబుతున్నారు. నిబంధనల ప్రకారం ఉండాల్సిన పది ప్రోగ్రామ్ ఆఫీసర్లలో కేవలం మూడు పోస్టులు మాత్రమే భర్తీ చేసి, వాటిలో కూడా తనకు పరిచయమున్న వారినే నియమించుకున్నట్లు సమాచారం.
ఏసీబీకి చిక్కకుండా కొత్త పద్ధతులు
అవినీతి నిరోధక శాఖకు చిక్కకుండా సదరు అధికారి కొత్త పద్ధతులు అనుసరిస్తున్నాడని తెలుస్తోంది. ఉదయం వేళల్లోనే కార్యాలయానికి వచ్చి వసూళ్లు జరుపుతుండగా, లంచం ఇచ్చే వారిని ఒక్కచోట కాకుండా పలుచోట్లకు తిప్పి చివరికి ఎవరూ లేని ప్రదేశంలో డబ్బులు స్వీకరిస్తున్నట్లు సమాచారం.
ఇంత భారీ అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ సంబంధిత అధికారిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక ఉన్న కారణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారుల పాత్ర ఏమిటన్నది వెలుగులోకి రావాల్సి ఉంది.

Post a Comment