-->

హైదరాబాద్‌లో కల్తీ డ్రై ఫ్రూట్స్ దందా బట్టబయలు.. వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్‌లో కల్తీ డ్రై ఫ్రూట్స్ దందా బట్టబయలు.. వ్యక్తి అరెస్ట్


హైదరాబాద్‌లో పాడైపోయిన డ్రై ఫ్రూట్స్‌ను నాణ్యమైనవిగా మార్చి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలామంది రోజువారీ ఆహారంలో డ్రై ఫ్రూట్స్‌ను భాగం చేసుకుంటుండగా, ఈ అవసరాన్ని కొందరు కేటుగాళ్లు దుర్వినియోగం చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది.

పోలీసుల వివరాల ప్రకారం, విశ్వసనీయ సమాచారం మేరకు హైదరాబాద్ సిటీ సీసీఎస్ (DD) స్పెషల్ క్రైమ్ టీమ్, ఫుడ్ అడల్టరేషన్ టీమ్ మరియు బహదూర్‌పురా పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా పాడైపోయిన, బూజు పట్టిన మరియు దుర్వాసన వస్తున్న డ్రై ఫ్రూట్స్‌ను నాణ్యమైనవిగా నమ్మించి విక్రయిస్తున్న అసవా మనీష్ (42) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

అసవా మనీష్ చార్మినార్ ప్రాంతంలోని చేలాపురాలో “GEM Foods (Imports and Exports)” పేరుతో గోదాం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతడు కావాలనే పాడైపోయిన డ్రై ఫ్రూట్స్‌ను సేకరించి వాటిని శుభ్రపరిచి నాణ్యమైనవిగా మార్చి మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లు విచారణలో బయటపడింది.

పోలీసులు నిర్వహించిన దాడుల్లో అతని గోదాం నుంచి 30 కార్టన్ బాక్సుల్లో ఉన్న పాడైపోయిన, అపరిశుభ్రమైన డ్రై ఫ్రూట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రై ఫ్రూట్స్ అపరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ చేసి ఉండటమే కాకుండా మానవ వినియోగానికి పూర్తిగా అనర్హమని అధికారులు తెలిపారు.

ప్రజలకు సూచనలు:
ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు లేదా డ్రై ఫ్రూట్స్ కొనుగోలు చేసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కొనుగోలు చేసే ముందు వాటి నాణ్యత, వాసన, రూపాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని తెలిపారు. ఎవరైనా పాడైపోయిన లేదా కల్తీ ఆహార పదార్థాలను విక్రయిస్తున్నట్లు గమనిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా ఆహార భద్రతా అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793