-->

కాల్పుల దోపిడీ తర్వాత నగరమంతా పోలీసుల కట్టుదిట్టమైన నిఘా

కరీంనగర్ హై అలెర్ట్..! కాల్పుల దోపిడీ తర్వాత నగరమంతా పోలీసుల కట్టుదిట్టమైన నిఘా


కరీంనగర్, మే 3: కరీంనగర్ నగరంలో జరిగిన సంచలన కాల్పుల దోపిడీ ఘటన తర్వాత పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. జ్యోతినగర్‌లోని పీఎంజే జ్యువెలరీ షాపులో జరిగిన ఈ దాడి నగరాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.

ఘటన అనంతరం పోలీసులు వెంటనే అప్రమత్తమై, నిందితుల కోసం విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు ప్రారంభించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నగరంలోని ప్రధాన రహదారులు, కీలక జంక్షన్లు, శివారు ప్రాంతాలు, అలాగే బయటకు వెళ్లే మార్గాలన్నింటిపై కట్టుదిట్టమైన తనిఖీలు చేపట్టుతున్నారు.

చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తుండగా, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. నగరంలోకి వచ్చే, వెళ్లే మార్గాలన్నీ పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు.

ఇక ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను సేకరించిన పోలీసులు దుండగుల కదలికలను ట్రాక్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. క్లూస్ టీం, ఫోరెన్సిక్ నిపుణులు ఘటనాస్థలంలో ఆధారాలు సేకరిస్తుండగా, ఉన్నతాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

కాల్పులతో కూడిన ఈ దోపిడీ ఘటనతో కరీంనగర్ నగరం భయాందోళనలకు గురవుతుండగా, నిందితుల పట్టివేత కోసం పోలీసులు ఫుల్ అలెర్ట్‌లో ఉన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793