ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం.. తృటిలో తప్పిన ప్రమాదం
జమ్మూ: జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు Farooq Abdullah పై హత్యాయత్నం జరిగిన ఘటన సంచలనం రేపింది. జమ్మూలో జరిగిన ఒక వివాహ వేడుకలో ఈ ఘటన చోటుచేసుకుంది. భద్రతా సిబ్బంది అప్రమత్తతతో ఆయనకు పెను ప్రమాదం తప్పింది.
సమాచారం ప్రకారం, జమ్మూలో జరిగిన వివాహ వేడుకకు హాజరైన ఫరూక్ అబ్దుల్లాను ఓ వ్యక్తి వెనుక నుంచి అనుసరిస్తూ వచ్చాడు. అనంతరం అతడు అత్యంత సమీపం నుంచి పిస్టోల్‌తో కాల్పులు జరపడానికి ప్రయత్నించాడు. దాడి సమయంలో అతను పాయింట్-బ్లాంక్ రేంజ్‌లో తుపాకీ గురిపెట్టి కాల్చేందుకు యత్నించినట్లు తెలుస్తోంది.
అయితే అక్కడే ఉన్న జాతీయ భద్రతా దళం కమాండోలు వెంటనే స్పందించి అతడిని వెనక్కి నెట్టడంతో తుపాకీ గురి తప్పింది. దీంతో ఫరూక్ అబ్దుల్లా తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
దాడి చేసిన వ్యక్తిని కమల్ సింగ్ జామ్వాల్‌గా గుర్తించిన పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడ ఉన్న కొంతమంది కార్యకర్తలు అతడిని కొట్టిన దృశ్యాలు వీడియోల్లో కనిపిస్తున్నాయి.
ఈ ఘటనతో జమ్మూ కాశ్మీర్‌తో పాటు దేశవ్యాప్తంగా కలకలం రేగింది. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇంత సమీపంలో దాడి జరగడం భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Post a Comment