బైక్ దొంగతనం కేసు ఛేదన… నిందితుడు అదుపులోకి, బైక్ స్వాధీనం
గోదావరిఖని, మార్చి 11: గోదావరిఖని ప్రాంతంలో జరిగిన బైక్ దొంగతనం కేసును పోలీసులు వేగంగా ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకుని బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని రామగుండం పోలీస్ కమీషనరేట్ అధికారులు బుధవారం పత్రికా ప్రకటనలో వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గోదావరిఖని హనుమాన్ నగర్‌కు చెందిన రేగుల వెంకటేష్ పాలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 10వ తేదీ ఉదయం సుమారు 9:30 గంటల సమయంలో టిఫిన్ చేయడానికి లక్ష్మీనగర్‌లోని మున్సిపల్ కాంప్లెక్స్ వద్దకు తన TS 22 5029 నెంబర్ గల ఫ్యాషన్ ప్రో మోటార్ సైకిల్ పై వెళ్లాడు. కాంప్లెక్స్ వెనుక భాగంలో బైక్‌ను పార్క్ చేసి టిఫిన్ చేయడానికి వెళ్లాడు.
కొద్దిసేపటి తరువాత తిరిగి వచ్చి చూడగా బైక్ కనిపించకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఎక్కడా కనిపించలేదు. దీంతో గుర్తు తెలియని వ్యక్తులు తన బైక్‌ను దొంగిలించారని రేగుల వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు అందుకున్న వెంటనే ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆదేశాల మేరకు ఎస్సై మనోహర్ సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకుని పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. దర్యాప్తులో బైక్‌ను దొంగిలించిన వ్యక్తిని గుర్తించి అతనిని అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఎస్సై మనోహర్ వెల్లడించారు.

Post a Comment