గోవర్ధనగిరిలో పేలుడు కలకలం.. వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన
వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలో జరిగిన పేలుడు ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడగా, ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గ్రామానికి చెందిన మేకల శేఖర్, రమణమోని మహేష్, ఎండి చాంద్ భాష ముగ్గురు వ్యక్తులు పశువులను మేపేందుకు గ్రామ శివారుకు వెళ్లారు. సాయంత్రం సమయంలో ఊర చెరువు అలుగు సమీపంలో ఉండగా, గోవర్ధనగిరి నుంచి గోపాలదిన్నెకు వెళ్లే మార్గంలో పందుల షెడ్డు వద్ద ఒక చెట్టుపై అనుమానాస్పద కవర్ కనిపించింది.
ఆ కవర్‌లో ఏముందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో దాన్ని కిందికి దించి తెరిచి చూడగా, అందులో గోళాకారంలో దారంతో చుట్టిన వస్తువులు కనిపించాయి. వాటి గురించి తెలియకపోవడంతో మేకల శేఖర్ రెండు వస్తువులను తీసుకుని రాయిపై పెట్టి పగులగొట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా భారీ శబ్ధంతో అవి పేలిపోయాయి.
ఈ పేలుడులో శేఖర్ ఎడమచేయి తీవ్రంగా దెబ్బతింది. రక్తస్రావం ఎక్కువగా కావడంతో తోటి వ్యక్తులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. అనంతరం ఆయనను వీపనగండ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు.
నాటు బాంబులు కావని పోలీసుల స్పష్టం
ఘటనపై గ్రామంలో నాటు బాంబుల ప్రచారం జరగడంతో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మిగిలిన పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
వీపనగండ్ల ఎస్సై నరేశ్ మాట్లాడుతూ, అవి నాటు బాంబులు కావని, తక్కువ తీవ్రత కలిగిన పేలుడు పదార్థాలని తెలిపారు. అడవి పందుల వేట కోసం గుర్తుతెలియని వ్యక్తులు వాటిని ఉపయోగిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని ఆయన సూచించారు.
జాగ్రత్తలు అవసరం
అనుమానాస్పద వస్తువులు కనిపించినప్పుడు వాటిని తాకకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

Post a Comment