మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఆటో డ్రైవర్ అంకుశావలి
రామగుండం పరిధిలోని 8 ఇంక్లైన్ కాలనీలో మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ ఆటో డ్రైవర్ అంకుశావలి విశేష ప్రశంసలు అందుకుంటున్నారు. “మానవసేవయే మాధవసేవ” అనే భావనతో ఆయన చేస్తున్న సేవలు స్థానికంగా ఆదర్శంగా మారాయి.
ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా అంకుశావలి తన సొంత ఖర్చులతో కాలనీలోని భక్తులకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. ఇంటి వద్ద నుంచి దేవాలయానికి, తిరిగి దేవాలయం నుంచి ఇంటికి భక్తులను తీసుకెళ్లడం మాత్రమే కాకుండా, చల్లటి త్రాగునీటి సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నారు. మతభేదాలు లేకుండా అందరికీ సేవ చేయడం ఆయన ప్రత్యేకతగా నిలుస్తోంది.
ఈ సేవా కార్యక్రమాల నేపథ్యంలో 8వ కాలనీ భక్తాంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, ప్రజాప్రతినిధులు అంకుశావలిని ఘనంగా సన్మానించారు. 17వ డివిజన్ కార్పొరేటర్ అనుము స్వరూప రాములు, 18వ డివిజన్ కార్పొరేటర్ దేవనపల్లి చక్రపాణి, 19వ డివిజన్ కార్పొరేటర్ మారెల్లి సుశీల రాజిరెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుండేటి రాజేష్, హిందూ వాహిని సభ్యులు మరియు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అలాగే ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ ఆధ్వర్యంలో అంకుశావలి దంపతులను ప్రత్యేకంగా శాలువాలతో సత్కరించారు. జామియా మస్జిద్ ఇమామ్ మౌలానా రఫీక్ ఖాస్మీ చేతుల మీదుగా చలివేంద్రం ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, అంకుశావలి చేస్తున్న సేవలు మతసామరస్యానికి నిదర్శనమని, సమాజంలో ఐక్యతను పెంపొందించేలా ఉన్నాయని కొనియాడారు.

Post a Comment