-->

పిల్లలతో కలిసి బావిలో దూకిన తల్లి.. ముగ్గురు మృతి, బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు

పిల్లలతో కలిసి బావిలో దూకిన తల్లి.. ముగ్గురు మృతి, బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు


మహబూబ్‌నగర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ వివాదం కారణంగా ఓ మహిళ క్షణికావేశంలో తన పిల్లలతో కలిసి బావిలో దూకిన ఘటన గురువారం ఎల్కిచర్ల గ్రామంలో జరిగింది. ఈ ఘటనలో తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి చెందగా, బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, భూత్పూర్ మండలం పరిధిలోని ఎల్కిచర్ల గ్రామానికి చెందిన బీరయ్య, జంగమ్మ (40) దంపతులకు జ్యోతి (14), శైలజ (12), జస్వంత్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. బీరయ్య ఇటీవల తమ వ్యవసాయ పొలంలో బోరు వేయించగా నీళ్లు రాకపోవడంతో మరో బోరు వేయించాలని నిర్ణయించుకున్నాడు. అయితే జంగమ్మ దీనికి తీవ్రంగా వ్యతిరేకించింది.

అయినా భర్త తన మాట వినకుండా రెండో బోరు వేయడం ప్రారంభించడంతో జంగమ్మ తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆవేశానికి లోనైన ఆమె తన ముగ్గురు పిల్లలను సమీపంలోని బావి వద్దకు తీసుకెళ్లి ముందుగా వారిని బావిలో తోసి, అనంతరం తానూ దూకింది.

ఈ ఘటనలో జంగమ్మతో పాటు ఆమె కుమార్తెలు జ్యోతి, శైలజ అక్కడికక్కడే మృతి చెందారు. అయితే బావిలో పడిన జస్వంత్ చెట్టు వేరు పట్టుకుని వేలాడుతూ ఉండటంతో ప్రాణాలతో బయటపడ్డాడు.

ఈ సంఘటనను గమనించిన గ్రామస్తులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న వారు బాలుడిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793