ఒకే చోట ప్రాణాలు విడిచిన ఇద్దరు ప్రాణ స్నేహితులు
మహబూబాబాద్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణ స్నేహితులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన ఈ ఇద్దరి స్నేహం చివరికి మరణంలోనూ విడిపోలేదు. ఒకరిపై మరొకరు పడిన స్థితిలో మృతదేహాలు కనిపించడంతో గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు.
పోలీసుల సమాచారం ప్రకారం మహబూబాబాద్ జిల్లా లక్షతండా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మరిపెడ మండలం గాలివారిగూడెం గ్రామానికి చెందిన ఉదయ్ కిరణ్, భిక్షం అనే ఇద్దరు యువకులు బైక్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
ఇద్దరూ తమ మరో స్నేహితుడిని హైదరాబాద్‌కు పంపించేందుకు బస్సు ఎక్కించడానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో ఒకరినొకరు హత్తుకున్నట్టుగా పడిపోయి ప్రాణాలు విడిచిన దృశ్యం చూసి స్థానికులు తీవ్రంగా కలత చెందారు.
చిన్నప్పటి నుంచి విడదీయరాని స్నేహితులుగా ఉన్న వీరిద్దరి మరణవార్త గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనతో గాలివారిగూడెం గ్రామంతో పాటు ఆసుపత్రి పరిసరాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Post a Comment