సంగారెడ్డి వద్ద రెండు బస్సులు ఢీ – ప్రయాణికులకు స్వల్ప గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లా పరిధిలోని ఇస్నాపూర్ జాతీయ రహదారిపై రెండు బస్సులు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. మలుపు తిరుగుతున్న ఎలక్ట్రికల్ బస్సును, సంగారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది.
సంగారెడ్డి నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఈ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో రెండు బస్సుల అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే అదృష్టవశాత్తూ బస్సుల్లో ఉన్న ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ముందున్న ఎలక్ట్రికల్ బస్సు అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు డ్రైవర్ తెలిపారు. ప్రమాదంలో కొంతమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి.
గాయపడిన వారిని సమీపంలోని పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఘటన అనంతరం ట్రాఫిక్ కొంతసేపు అంతరాయం కలిగినా, ట్రాఫిక్ పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని యథావిధిగా రాకపోకలను పునరుద్ధరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Post a Comment