-->

మహిళ దారుణ హత్య.. మృతదేహం పక్కనే రాత్రంతా మూడేళ్ల చిన్నారి రోదన

మహిళ దారుణ హత్య.. మృతదేహం పక్కనే రాత్రంతా మూడేళ్ల చిన్నారి రోదన


షాద్‌నగర్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ప్రాంతంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళను దారుణంగా హత్య చేసి, ఆమె మృతదేహాన్ని చెట్ల పొదల్లో పడేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మరింత విషాదకర విషయం ఏమిటంటే, మృతురాలి మూడేళ్ల చిన్నారి రాత్రంతా తల్లి మృతదేహం పక్కనే ఉండి రోదిస్తూ గడిపింది.

స్థానికుల వివరాల ప్రకారం… ఫరూఖ్‌నగర్ మండలం దేవునిపల్లి గ్రామ పంచాయతీ రంగారెడ్డిగూడాకు చెందిన పోతుల శోభారాణి (30)కు 10 ఏళ్ల క్రితం మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండకు చెందిన రాజుతో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇదిలా ఉండగా, అదే గ్రామానికి చెందిన నరసింహులతో శోభారాణికి అక్రమ సంబంధం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన తరువాత దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతూ వచ్చాయి. నెలరోజుల క్రితం శోభారాణి తన భర్తను వదిలి పిల్లలతో కలిసి తల్లిగారింటికి వెళ్లింది.

ఈ క్రమంలో నరసింహులు ఆమెను వివాహం చేసుకోవాలని ప్రయత్నిస్తూ కుల పెద్దలతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ విషయంపై ఆగ్రహం చెందిన భర్త రాజు, శనివారం రాత్రి శోభారాణిని హత్య చేసి, రంగారెడ్డిగూడా-తంగడపల్లి రహదారి వద్ద చెట్ల పొదల్లో పడేశాడని స్థానికులు అనుమానిస్తున్నారు.

ఆదివారం ఉదయం పొలానికి వెళ్లిన రైతు గోవింద్‌కు చిన్నారి రోదిస్తూ కనిపించడంతో అనుమానం వచ్చి పరిశీలించగా, అక్కడ మహిళ మృతదేహం కనిపించింది. వెంటనే గ్రామ సర్పంచ్‌కు సమాచారం అందించారు.

తల్లి మృతదేహం పక్కనే చిన్నారి రాత్రంతా ఉండి రోదించిన దృశ్యం గ్రామస్తులను కంటతడి పెట్టించింది.

సమాచారం అందుకున్న షాద్‌నగర్ సీఐ సీతారాం సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793