-->

సమయానికి రాని TGRTC బస్సులతో ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు

సమయానికి రాని TGRTC బస్సులతో ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు


భూపాలపల్లి జిల్లా, మార్చి 22: ఆర్టీసీ బస్సులు సమయపాలన పాటించకపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమయపాలన విషయంలో సంబంధిత డిపో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యేకంగా సాయంత్రం వేళల్లో భూపాలపల్లి నుండి గోదావరిఖని వెళ్లే ప్రయాణికులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. బస్సు ఎప్పుడు వస్తుందో, వస్తుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. కొన్నిసార్లు ఒకేసారి రెండు మూడు బస్సులు వస్తుండగా, మరికొన్ని సందర్భాల్లో గంటల తరబడి బస్సుల కోసం ఎదురుచూడాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు.

ఇటీవల ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. బస్సుల్లో నిల్చోవడానికి కూడా స్థలం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ప్రయాణికుల సంఖ్య పెరిగినప్పటికీ, బస్సుల సంఖ్యను పెంచడంలో భూపాలపల్లి, గోదావరిఖని, మంథని డిపో అధికారులు విఫలమయ్యారని విమర్శలు వినిపిస్తున్నాయి. భూపాలపల్లి నుండి గోదావరిఖని వరకు ఐదు డిపోలకు చెందిన బస్సులు నడుస్తున్నప్పటికీ, సమర్థవంతమైన సేవలు అందడం లేదని ప్రయాణికులు అంటున్నారు.

ఈ రూట్‌లో ప్రతిరోజూ వేలాది మంది భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్, కాళేశ్వరం ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు ఈ సేవలపై ఆధారపడుతున్నారు.

మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చిన తర్వాత ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు పెరగాల్సి ఉండగా, వాస్తవానికి బస్సుల సంఖ్య తగ్గుతోందని ఆరోపణలు ఉన్నాయి. అద్దె బస్సుల ఒప్పందాలు ముగిసిన తర్వాత వాటి స్థానంలో ఆర్టీసీ బస్సులు నడపకపోవడం కూడా సమస్యను మరింత తీవ్రం చేస్తోంది.

అదే సమయంలో, పగటి వేళల్లో వరుసగా బస్సులు నడుస్తుండగా, రాత్రి వేళల్లో ఒక్క బస్సు కూడా కనిపించకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి బస్సుల సంఖ్య పెంచి, సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793