-->

మూడు నెలల్లో 28 మంది మృతి.. ‘కీడు’ భయంతో ఊరు ఖాళీ చేసిన గ్రామస్తులు!

మూడు నెలల్లో 28 మంది మృతి.. ‘కీడు’ భయంతో ఊరు ఖాళీ చేసిన గ్రామస్తులు!


కరీంనగర్ జిల్లా, జమ్మికుంట మండలం (మార్చి 22): ఊరంతా భయంతో వణికిపోయింది.. ప్రజలు పిట్టల్లా రాలిపోతుండటంతో గ్రామస్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని గండ్రపల్లి గ్రామంలో గడిచిన మూడు నెలల కాలంలోనే 28 మంది మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది.

మరణాల వెనుక అనారోగ్యం, వృద్ధాప్యం వంటి సహజ కారణాలు ఉన్నప్పటికీ.. ఇంత తక్కువ సమయంలో ఇంతమంది మృతి చెందడం గ్రామస్థుల్లో భయాందోళనలకు దారి తీసింది. గ్రామానికి ఏదో ‘కీడు’ పట్టిందనే అనుమానంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

ఈ క్రమంలో గ్రామ పెద్దలు ఒక పురోహితుడిని సంప్రదించగా, ఆయన సూచన మేరకు ‘గ్రామ బహిష్కరణ’ అనే సంప్రదాయాన్ని పాటించాలని నిర్ణయించారు. ముందుగా డప్పు కొట్టి గ్రామస్తులకు సమాచారం ఇచ్చి, తెల్లవారుజామునే అందరూ తమ ఇళ్లకు తాళాలు వేసి, పశువులతో కలిసి గ్రామాన్ని విడిచి వెళ్లిపోయారు.

రోజంతా గ్రామం బయట పొలాల్లోనే గడుపుతూ, అక్కడే వంటలు చేసుకుని భోజనం చేశారు. ఇలా చేయడం ద్వారా గ్రామానికి పట్టిన పీడ తొలగిపోతుందని వారి నమ్మకం.

గ్రామమంతా నిర్మానుష్యంగా మారిపోయిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఆధునిక కాలంలో కూడా ఇలాంటి సంప్రదాయాలను అనుసరించడం పై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వరుస మరణాల భయం ముందు తర్కం పనిచేయడం లేదని గ్రామస్థులు చెబుతున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793