కుప్పకూలిన బాల్కనీ.. ఇద్దరి మృతి.. ఒకరికి తీవ్ర గాయాలు
హైదరాబాద్: నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. పాత అపార్ట్‌మెంట్‌లో బాల్కనీ కుప్పకూలడంతో ఇద్దరు ఎలక్ట్రిషియన్లు మృతిచెందగా, ఫ్లాట్ యజమాని తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో నగరంలో పాత భవనాల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసుల వివరాల ప్రకారం.. పంజాగుట్ట పరిధిలోని కుందన్‌బాగ్‌లో ఉన్న శ్రీ వత్స అపార్ట్‌మెంట్స్‌లో ఈ ప్రమాదం జరిగింది. భవనం మూడో అంతస్తులో విస్తరణ పనులు జరుగుతుండగా, ద్వారకప్రసాద్ ఫ్లాట్‌లో ఎలక్ట్రిక్ పనుల కోసం దేవిదాస్ మరియు అతని కుమారుడు వివేక్ అక్కడికి వచ్చారు.
పనుల సమయంలో ముగ్గురూ బాల్కనీలో కూర్చొని మాట్లాడుతుండగా, అకస్మాత్తుగా ఇనుప కడ్డీలతో ఉన్న స్లాబ్ కూలిపోయింది. దీంతో ముగ్గురూ మూడో అంతస్తు నుంచి కిందకు పడ్డారు.
ఈ ప్రమాదంలో వివేక్ ఘటన స్థలంలోనే మృతిచెందగా, అతని తండ్రి దేవిదాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఫ్లాట్ యజమాని తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పాత అపార్ట్‌మెంట్లలో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా అనే దానిపై కూడా విచారణ జరుగుతోంది.
ఇటీవలి కాలంలో పాత భవనాలు కూలిపడిన ఘటనలు పెరుగుతుండటంతో, ఈ సంఘటన నగరంలో భవన భద్రతపై తీవ్ర చర్చకు దారి తీసింది. అధికారులు పాత భవనాలపై ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.

Post a Comment