హృదయ విదారక ఘటన పత్తి చేనులో ఆడ పసికందు
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం వల్లగొండ గ్రామపంచాయతీ సీతానగర్ శివారులో శనివారం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పత్తి చేనులో ఒక రోజు వయసున్న పసికందును గుడ్డలో కట్టి పడేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఉదయం పత్తి చేను వైపు వెళ్లిన గ్రామస్తులకు శిశువు అరుపులు వినిపించడంతో వారు అప్రమత్తమయ్యారు. వెంటనే అక్కడికి చేరుకుని చూడగా గుడ్డలో చుట్టి సంచిలో పడేసి ఉన్న ఆడ శిశువు కనిపించింది. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శిశువును సురక్షితంగా బయటకు తీసి కాగజ్‌నగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించారు.
ఈ విషయాన్ని బాల సంరక్షణ అధికారి మహేష్‌కు తెలియజేయడంతో ఆయన సిబ్బందితో కలిసి చేరుకుని శిశువును బాల సంరక్షణ కేంద్రానికి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కన్నపేగు బంధాన్ని తెంచుకుని ఇలాంటి అమానుష చర్యకు పాల్పడిన తల్లి, కుటుంబ సభ్యులపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment