రంజాన్ మాసం మానవతా విలువలను పెంపొందిస్తుంది: అబ్దుల్ బాసిత్
Bhadradri kothagudem : చావు, పుట్టుకల నడుమ మానవ జీవిత మర్మాన్ని సవివరంగా వివరిస్తూ మార్గనిర్దేశం చేసే పవిత్ర గ్రంథం ఖురాన్ అని అబ్దుల్ బాసిత్ పేర్కొన్నారు. ఖురాన్ అవతరించిన పవిత్ర మాసమే రంజాన్ మాసమని, ఇది సమస్త మానవాళికి సృష్టికర్త అందించిన ఆదేశాల గ్రంథమని తెలిపారు.
పవిత్ర శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవిపల్లిలోని మస్జిద్-ఏ-అక్సాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ సృష్టికి మూలం మనిషేనని చెప్పారు. మనిషి మంచి మనసుతో, నీతి–నిజాయితీతో, ధర్మబద్ధంగా జీవిస్తే సమాజంలో మనుషుల మధ్య సత్సంబంధాలు మెరుగుపడి శాంతి, సామరస్యాలు వెల్లివిరుస్తాయని పేర్కొన్నారు.
రంజాన్ ఉపవాసాల ద్వారా దైవభీతి పెరగడమే కాకుండా సాటి మానవుల పట్ల సానుభూతి, దయాగుణం పెంపొందుతాయని తెలిపారు. నెల రోజుల ఉపవాస సాధనలో అలవర్చుకున్న మంచి మానవతా విలువలను మిగతా సంవత్సరం అంతా ఆచరణలో చూపించాలని కోరారు.
ఈ సందర్భంగా ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం వెంటనే ఆపివేయాలని ఆయన కోరారు. యుద్ధం వల్ల మానవ వినాశనం తప్ప మరే ప్రయోజనం లేదని చెప్పారు. జీవితం శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని, ఈ లోకంలో చేసిన తప్పులకు మరణానంతరం కఠినమైన శిక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఖురాన్‌లో అల్లాహ్ హెచ్చరించాడని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మస్జిద్ ఇమామ్ మౌలానా అన్వర్, అబీద్, ముజాహీద్, గౌస్, ఇమామ్ షరీఫ్, అహ్మద్, సాదతుల్లాహ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment