భార్య హత్య కేసులో భర్తకు జీవిత ఖైదు ₹1000 జరిమానా
కొత్తగూడెం లీగల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ శుక్రవారం భార్య హత్య కేసులో భర్తకు జీవిత ఖైదు విధిస్తూ కీలక తీర్పు వెలువరించారు.
కేసు వివరాలు:
టేకులపల్లి మండలం కొత్త తండాకు చెందిన భానోత్ ఈశ్వర్ 2020 డిసెంబర్ 4న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన అక్క గుగ్లోత్ మంగను 16 సంవత్సరాల క్రితం హనుమతండాకు చెందిన గుగ్లోత్ భాస్కర్‌కు వివాహం చేశారని తెలిపాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
వివాహం తరువాత భాస్కర్ మద్యానికి బానిసై, భార్యను తరచూ వేధిస్తూ, కొట్టడం, అనుమానించడం వంటి చర్యలకు పాల్పడేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రామ పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయతీలు జరిగినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదు.
2020 డిసెంబర్ 2న మంగ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
దర్యాప్తు వివరాలు:
పోలీసుల దర్యాప్తులో భాస్కర్ తన సోదరుడు నరేందర్‌తో కలిసి పథకం రచించి, ఇంట్లో ఒంటరిగా ఉన్న తన భార్యను చీరతో గొంతు నులిమి హత్య చేసినట్లు తేలింది. అనంతరం మృతదేహాన్ని ఇల్లందు-ఖమ్మం రోడ్డులో శాంతినగర్ సమీపంలోని బావిలో పడేసినట్లు విచారణలో బయటపడింది.
ఈ ఘటన అనంతరం భాస్కర్ 2020 డిసెంబర్ 13న పోలీసుల ఎదుట లొంగిపోయాడు. నరేందర్ పరారీలో ఉండగా, అతనిపై సరైన సాక్ష్యాలు లభించలేదు.
కోర్టు తీర్పు:
18 మంది సాక్షులను విచారించిన అనంతరం కోర్టు: IPC 302 కింద హత్య నేరం రుజువై గుగ్లోత్ భాస్కర్‌కు జీవిత ఖైదు మరియు ₹1000 జరిమానా విధించింది.
- IPC 201 కింద సాక్ష్యాలను నాశనం చేసిన నేరానికి 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు ₹1000 జరిమానా విధించింది. మొత్తం ₹2000 జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
అయితే, గుగ్లోత్ నరేందర్‌పై నేరం రుజువు కాలేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.వి.డి. లక్ష్మి వాదించగా, కోర్టు నోడల్ ఆఫీసర్ జి. రాఘవయ్య, లైజన్ ఆఫీసర్ ఎన్. వీరబాబు, పి.సి.ఎల్. వీరలాల్ సహకరించారు.

Post a Comment