స్కూల్ బస్సు – బైక్ ఢీ : ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు
జూలూరుపాడు, మార్చి 31: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూల్ బస్సు మరియు ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.
మంగళవారం మధ్యాహ్నం, జూలూరుపాడులోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు విద్యార్థులను వారి ఇళ్ల వద్ద దింపేందుకు పాపుకొల్లు మీదుగా బేతాళపాడు గ్రామం వైపు వెళ్తోంది. ఇదే సమయంలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వలస కూలీలు సంజు, శ్రీరామ్ ద్విచక్ర వాహనంపై గుండ్లరేవు గ్రామం వైపు ప్రయాణిస్తున్నారు.
గుండ్లరేవు సమీపంలోకి రాగానే, ఎదురెదురుగా వస్తున్న బస్సు మరియు బైక్ బలంగా ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రతకు ద్విచక్ర వాహనం పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, ఇద్దరు యువకులు రోడ్డుపై పడిపోయారు.
ఈ ఘటనలో శ్రీరామ్‌కు శరీరంలోని పలు భాగాల్లో తీవ్రమైన గాయాలు కాగా, సంజుకు స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, గాయపడిన వారిని కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రీరామ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
వలస కూలీల ఆవేదన
ప్రమాదానికి గురైన యువకులు మధ్యప్రదేశ్ నుంచి వచ్చి బేతాళపాడులో గుడారాలు వేసుకుని కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఉపాధి కోసం వచ్చిన వారు రోడ్డు ప్రమాదానికి గురవడంతో తోటి కూలీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Post a Comment