ట్యాంక్‌బండ్ శివకు ప్రభుత్వ గౌరవం.. రూ.5 లక్షల సాయం, కుమారుడికి ఉద్యోగం
హైదరాబాద్: నగరంలోని ట్యాంక్‌బండ్ వద్ద ప్రాణాలను కాపాడుతూ అనేక మందికి జీవితం ఇచ్చిన “ట్యాంక్‌బండ్ శివ”కు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. ఆయన సేవలను గుర్తిస్తూ రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.
ఇదే సమయంలో శివ కుటుంబానికి భరోసా కల్పించే చర్యగా ఆయన కుమారుడు వేణుమాధవ్‌కు హోంగార్డు ఉద్యోగాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నియామక పత్రాన్ని ముఖ్యమంత్రి స్వయంగా అందజేశారు.
హుస్సేన్ సాగర్ సరస్సు వద్ద ప్రమాదవశాత్తు నీటిలో పడిన వారు, ఆత్మహత్యాయత్నం చేసిన వారిని శివ అనేకసార్లు ప్రాణాలకు తెగించి రక్షించారు. ఆయన సేవలను సీఎం ప్రశంసించారు.
కుటుంబ ఆర్థిక పరిస్థితులు కష్టంగా ఉన్నాయని తెలుసుకున్న ప్రభుత్వం వెంటనే స్పందించింది. శివ కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయాలని, అలాగే ఉపాధి కోసం ట్యాంక్‌బండ్ సమీపంలో స్విమ్మింగ్‌పూల్ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు.
ముఖ్యమంత్రి చేతుల మీదుగా సాయం అందుకోవడం పట్ల శివ కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది. సమాజ సేవకు అంకితమైన వ్యక్తిని ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment